కరోనా కమ్మేస్తోంది. మన జీవితాలను శాసిస్తోంది. ప్రాణాలు బలవంతంగా తీసుకుపోతోంది. దేవుడు కూడా దిక్కుగా లేడనే ఆవేదన గుండెలను పిండేస్తుంటే.. కళ్ల ముందే తనవాళ్లు చనిపోతుంటే.. ఆ ఆక్రోశానికి.. ఆ కన్నీటీకి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. మమ్మల్ని కాపాడేవారే లేరా అని వారు చేసే ఆర్తనాదాలు మార్మోగుతున్నా.. స్పందించే నాథుడు కనపడటం లేదు. రాజకీయం కాదు గాని.. ఇలాంటప్పుడే మనకు ఒకాయన గుర్తుకొస్తారు. ఆయనయితే ఏం చేసేవారో అనిపిస్తోంది. ఆయన ఉంటే .. ఆపుతాడులే.. మనకేం కాదులే అనే భరోసా ఉండేది. కాని ఆయనిప్పుడు అధికారంలో లేడు. ఆయన సలహాలిచ్చినా పట్టించుకునేవాడే లేడు. పరిస్ధితి చూస్తూ బాధపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో ఉన్నారా పెద్దమనిషి. ఆయనే చంద్రబాబునాయుడు.
జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా
కోవిడ్..కరోనా.. మన జీవితాలను అల్లకల్లోలం చేసేస్తోంది. అందరి కలలను చెరిపేస్తోంది. తలరాతలనే మార్చేస్తోంది. మానవాళి ఇలాంటి సంక్షోభాన్ని ఇప్పటివరకు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఆంధ్రప్రదేశ్ ఆ కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. ప్రభుత్వం ప్రకటించే లెక్కలు ఒక ఎత్తయితే.. మనకు గ్రౌండ్ నుంచి తెలిసే వివరాలు మరో ఎత్తు. ప్రతిరోజూ ఫేస్ బుక్‌లో ఎవరో ఒక ఆత్మీయుడు లేదా ఆత్మీయురాలు చనిపోయినట్లు చూడాల్సి వస్తోంది. బంధువుల్లో కూడా ఎవరో ఒకరు చనిపోయారనే కబురు వస్తోంది. మనకు తెలిసే అన్ని మరణాలు ఉంటుంటే.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రమే డబల్ డిజిట్ కూడా దాటకపోవడం విచిత్రమే. అంత ఘోరంగా రాష్ట్రం ఉంటే.. ప్రభుత్వాధినేతలు మాత్రం వారనుకున్న పనులు ఎంతవరకు అయ్యాయో చూసుకుంటున్నారే తప్ప.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో అది చేయటం లేదు. ఇంతకంటే ఏం చేస్తాం.. అనే సమాధానాలు కూడా వస్తున్నాయి. దీనికి ఎవరూ ఏమీ చేయలేరు.. అంతే అనే ఆన్సర్స్ కూడా వస్తున్నాయి.
నిర్లక్ష్యానికి ఫలితం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదట ఇదేం కాదు.. పారాసిటమాల్ వేసుకుంటే చాలు.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలని తీసిపారేశారు. ఆవు గట్టున మేస్తే దూడ పొలంలోకి పోతుందా.. అన్నట్లు అధికారులు కూడా అలాగే వ్యవహరించారు. ఆ నిర్లక్ష్యానికి ఫలితం మనందరం అనుభవిస్తున్నాం. ఇప్పుడు రివ్యూ సమావేశాలు పెడుతున్నారు.. కాని యాక్షన్ ప్లాన్ ఏమీ ఉండదు. కేవలం ఆదేశాలు ఇవ్వడం తప్ప.. ఆచరణ ఏమీ కనపడటం లేదు. ఇది ఆరోపణో, విమర్శో కాదు.. కళ్లకు కనపడుతున్న కటిక నిజం. ఎటు చూసినా ఆస్పత్రిలో బెడ్ కోసం పరుగులు పెట్టేవారే కనపడుతున్నారు.. ఎక్కడ విన్నా.. ఆక్సిజన్ లేదు.. కావాలని కాళ్లా వేళ్లా పడేవాళ్ల ఆవేదనే వినపడుతోంది. ఆఖరికి ప్రాణాలు పోతే.. అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా అవకాశం లేని దౌర్భాగ్య పరిస్ధితిలోకి మనం నెట్టివేయబడ్డాం. ఇంత వ్యవస్ధ ఉండి కూడా.. ఎవరూ ఏమీ చేయలేని చేతగాని పాలనలో ఉన్నామా అని ఆవేశం తన్నుకొస్తోంది.

విపత్కర పరిస్థితులను చంద్రబాబు మేనేజ్ చేసిన తీరు
అదే చంద్రబాబునాయుడు ఉండుంటే.. ఆ ఊహకే ప్రజల్లో ధైర్యం రెక్కలు కట్టుకుని వాలుతుంది. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను ఆయన మేనేజ్ చేసిన తీరును అందరూ మననం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి చంద్రబాబు సీఎం కాగానే.. గోదావరి జిల్లాల్లో వరదలొచ్చాయి. స్వయంగా వరద ప్రాంతాలకు వెళ్లి.. అందరికీ ధైర్యం చెప్పడమే కాదు.. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదిక మీద చేయించారు. విభజన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక విశాఖలో తుఫాన్ వచ్చింది. నగరం కకావికలం అయింది. కాని చంద్రబాబునాయుడు ఆ నగరంలో క్యాంప్ వేసి మరీ… సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయన క్యాంప్ ఆఫీసులోనే కాలక్షేపం చేయలేదు.. డైరెక్టుగా ప్రజలకు అవసరమైన దగ్గరే క్యాంప్ ఆఫీసు పెట్టుకుని సహాయం అందించారు. బాబును మెచ్చుకోని విశాఖ వాసే లేడు ఆ సమయంలో.
తర్వాత శ్రీకాకుళంలో తుఫాన్ వస్తే.. మంత్రులందరినీ వెంటబెట్టుకుని వెళ్లి.. గ్రామాలవారీగా బాధ్యతలు అప్పచెప్పి.. మరీ మానిటరింగ్ చేశారు. టెక్నాలజీని వాడుకోవడంలో చంద్రబాబును మించినోళ్లు లేరని అధికారులే చెబుతారు. ఆర్టీజీఎస్ అనే వ్యవస్ధను పెట్టి.. దాని ద్వారా మొత్తం సమాచారాన్ని చిటికెలో తెప్పించుకునేవారు. డ్రోన్లను వాడి.. వరద ప్రాంతాల్లో పరిస్ధితిని వీడియో ద్వారా ప్రత్యక్షంగా చూసి.. ఆదేశాలిచ్చేవారు. ప్రతి క్షణం ఫాలోఅప్ చేసేవారు. అధికారులు ఆ స్పిరిట్‌కు స్పందించి పని చేసేవారు. కొందరైతే ఈ పని రాక్షసుడితో మనం పడలేంరా బాబూ అని కూడా అనుకున్నారు. సంక్షోభం వస్తే ఎదుర్కోనే పద్ధతి అది. ఒక యుద్ధంలా చేయాలి.. అప్పుడే బయటపడగలం. కాని ఇప్పుడేం జరుగుతోంది? యుద్ధం కాదు.. కనీసం టెన్షన్ కూడా పడటం లేదు.
విభజన తర్వాత..
విభజన తర్వాత ఆర్ధిక పరిస్థితి బాగోకపోతే.. నిధులు కూడా లేని పరిస్థితి ఉంటే.. వెళ్లి ఢిల్లీలో కూర్చోలేదు. రాజధాని ఎలా కట్టాలో ప్లాన్ చేశారు. రాజదానికి నిధుల కోసం ల్యాండ్ డెవలప్ మెంట్ కాన్పెప్ట్ అప్లయ్ చేసి.. భూసమీకరణ చేసి చరిత్ర సృష్టించారు. ఇది చేస్తూనే మరో వైపు చిత్తూరు జిల్లాలో హార్డ్ వేర్ పరిశ్రమలు.. విశాఖలో మెడ్ టెక్ జోన్ వంటివి ప్లాన్ చేశారు. సమగ్రాభివృద్ధి కోసం సమస్తం ఒడ్డి కృషి చేశారు. ఆయనుంటే అభివృద్ధి జరుగుతుందని.. అసలు ఆయన సీఎం కాదు.. సీఈఓ అని కూడా కామెంట్లు వచ్చాయి. ఈరోజు ఏంటి కాదు.. పదేళ్ల తర్వాత రాష్ట్రం ఎలా ఉండాలనే ఆలోచన చేశారు. కాని ఈ రోజుకి ఈ రోజు బ్యాంకులో ఎంత పడుతున్నాయి అని చూసుకునే రోజులివి. అందుకే ఆయన అధికారానికి దూరమయ్యారు.. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోలేని చేతగానివాళ్లు అధికారంలోకి వచ్చారు.
చంద్రబాబు ఈ కరోనా సంక్షోభంలో సీఎంగా ఉండి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదు. కేంద్రానికి, ప్రధానికి సైతం మార్గదర్శకంగా ఉండేలా వ్యూహాలు రూపొందించేవారు. స్పెయిన్‌లో ప్రతి హోటల్‌ను కూడా క్వారంటైన్‌గా వాడిన మోడల్ చూపించేవాళ్లు. ఇంతటి తీవ్ర సంక్షోభంలో ఆయన అధికారంలో లేకపోవడం చాలామంది దురదృష్టం.










