ఎదుటివాళ్లకు సాయం చేయాలనే ఆలోచన కొందరికే ఉంటుంది. జనంమెప్పు కోసం చేసేవారు కొందరైతే స్వతహాగా వారిలో ఉండే దానగుణం వల్ల చేసేవారు ఇంకొందరు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ఈ రెండోకోవలోకి వస్తారు. లాక్‌డౌన్ కాలంలో కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సాయం చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఆయన చేసిన మరో సాయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఓ మెరిట్ విద్యార్థినికి మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని చేయడానికి ప్రకాష్ రాజ్ ముందుకొచ్చారు.
పశ్చిమ గోదావరికి జిల్లాకు చెందిన సిరిచందన స్కూలు నుంచే అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. ఆమెకు మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం వచ్చింది. ఆమెకు తండ్రి లేడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అక్కడకు వెళ్లడానికి డబ్బు లేక ఆమె ఆశలు వదిలేసుకుంది. ఈ విషయం తెలిసి ప్రకాష్ రాజ్ ఆమెను మాంచెస్టర్ యూనివర్సిటీలో చదివించడానికి ముందుకొచ్చారు. దీంతో సిరిచందన, ఆమె తల్లి ఆనందానికి అవధులు లేవు. హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉన్న ప్రకాష్‌రాజ్‌ను కలుసుకొని తమ కృతజ్ఞతలు తెలిపారు. బాగా చదువుకొని, వృద్ధిలోకి రావాలని ప్రకాష్‌రాజ్ ఆమెను ఆశీర్వదించారు.
సిరిచందన మాట్లాడుతూ ‘మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దేవం గ్రామం. నాకు తొమ్మిదేళ్ల వయసులో మా నాన్న చనిపోయారు. అప్పట్నుంచీ మా అమ్మే కష్టపడి మమ్మల్ని చదివించింది. యూనివర్సిటీలో సీటు వచ్చినా అక్కడికి వెళ్లడానికి నేను ధైర్యం చెయ్యలేదు. నరేంద్ర అనే మా శ్రేయోభిలాషి నా గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినప్పుడు ప్రకాష్‌రాజ్ గారు చూశారట. అన్ని ఖర్చులు ఆయనే భరిస్తున్నారు.
ఆయన ఇచ్చిన ప్రేరణతో నేను బాగా చదువుకొని నాలాంటి మరో నలుగురికి సాయం చేయాలని అనుకుంటున్నా. నిజానికి మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువుకొనే స్థాయి మాకు లేదు. కానీ ఆర్థికంగా, నైతికంగా ప్రకాష్‌రాజ్ గారు ఇచ్చిన సపోర్ట్ ఎన్నటికీ మర్చిపోలేం. బుక్స్ దగ్గర్నుంచి కంప్యూటర్ దాకా ఆయనే సమకూర్చి పెట్టారు’ అని వివరించారు. తమ జీవితానికి ప్రకాష్ రాజ్ భరోసా ఇచ్చారని సిరిచందన తల్లి అన్నారు.











