ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో అన్ని దేశాలతో పాటుగా భారత్ కూడా తీవ్ర భయాందోళనలకు గురైన సంగతి తెలిసిందే. కరోనా తొలి వేవ్‌ను ఒకింత మేర సమర్థంగానే ఎదుర్కొన్నా.. సెకండ్ వేవ్‌లో దేశంలో భారీ ఎత్తున మరణాలు సంభవించడం, సరైన ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణమని విపక్షాలన్నీ విరుచుకుపడటంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ తగ్గినట్టుగా కనిపించింది. ప్రధాని కూడా ఇదే భావనతోనే కనిపించారని కూడా చెప్పాలి. కరోనాను ఎదుర్కొనే విషయంలో తమ ప్రభుత్వం అంతగా ఫలితం సాధించలేకపోయిందని కూడా మోదీ భావించినట్లుగా కూడా కథనాలు వినిపించాయి. అయితే అనతి కాలంలోనే వ్యాక్సినేషన్‌ను పరుగులు పెట్టించిన మోదీ.. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా మెరుగైన ఫలితాలను సాధించారు. దీంతో చాలా స్వల్ప వ్యవధిలోనే తిరిగి ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చారు. తన సక్సెస్‌ను ఘనంగా చెప్పుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. వ్యాక్సినేషన్ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
100 కోట్ల డోసుల ఘనత
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన దేశంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోవడం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమని ఆయన తెలిపారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా దేశ శక్తి ఏంటో ప్రపంచానికి చూపించామని చెప్పారు. కఠినమైన లక్ష్యాలను దేశం విజయవంతంగా చేరుకోగలదని చెప్పడానికి ఇదొక నిదర్శనమని ఆయన చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా టీకాలు అందించామని తెలిపారు. భారత్‌లో వ్యాక్సినేషన్ శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి కొనసాగిందని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ మోములో మునుపటి ఉత్సాహం చాలా స్పష్టంగానే కనిపించింది.
అయినా జాగ్రత్తలు తప్పనిసరి
వంద కోట్ల మేర వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసినప్పటికీ ప్రతి ఒక్కరూ ఇప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిందేనని తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ఎలా వేసుకుంటామో, అంతే సాధారణంగా మాస్క్ కూడా ధరించాలని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోన్న నేపథ్యంలో కరోనాను తట్టుకునే శక్తి ప్రజలకు వస్తోందని తెలిపారు. దేశంలో పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరికీ వ్యాక్సిన్లు అందాయని చెప్పారు. రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్లు వేయడమంటే ఇది సాధారణ విషయం కాదని తెలిపారు. దేశంలో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల దేశీయ నిపుణలతో పాటు విదేశీ నిపుణులు కూడా చాలా సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు దేశానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్పారు. దేశ యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.