తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధరణీ పోర్టల్ మరో రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. గత కొన్నిరోజులుగా ఈ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ధరణీ పోర్టల్‌లో అప్లోడ్ అయితేనే భూముల క్రయవిక్రయాలు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోర్టల్‌లో భూముల వివరాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం ద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూ సమస్యలు పరిష్కారం అవుతాయిని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. ఇందుకోసం అధికారులు రాత్రి పగలు శ్రమిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ పోర్టల్‌ను రూపొందిస్తున్నారు. అయితే ఈ పోర్టల్ పనితీరుపై ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులకు అనేక అనుమానాలున్నాయి. కనీస అవగాహన కూడా లేకపోవడంతో ప్రభుత్వం ఈ పోర్టల్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది.
పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణ
గతంలో వీఆర్వో వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో జరిగే అమ్మకాలు , కొనుగోళ్ళకు సంబంధించిన వివరాలను మండల కార్యాలయంలో భద్రపరిచేవారు. ఈ క్రమంలో రైతుల నుండి భారీగా లంచాలు తీసుకునే వారని, డబ్బులు ఇవ్వనిదే ఫైల్ కదిలేది కాదన్న అపవాదు ఉండేది. స్వయంగా ముఖ్యమంత్రే ఈ సమస్య ఎదుర్కున్నారని అసెంబ్లీ వేదికగా చెప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవస్థను రద్దు చేయడంతో ఆ పనిభారం మండల రెవెన్యూ అధికారులపై పడింది. ధరణీ పోర్టల్‌కు సంబంధించిన పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం ఉపయోగ పడుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లా కేంద్రం నుండి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తారని ఎమ్మార్వోల సంఘం నేతలు తెలిపారు.
సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఏం ప్రయోజనం లేదని ఎమ్మార్వోల సంఘం నేతలు అంటున్నారు. ధరణీ పోర్టల్ అంటూ చెబుతున్న నాటి నుండి నేటి వరకు ఒక్కరోజు కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేక పోయామని వాపోతున్నారు. ఎప్పూడు సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. సర్వర్ల సమస్యలు తలెత్తకుండా చూసుకోవడంతో పాటు పోర్టల్ నడిపేందుకు ఇంటర్ నెట్ కూడా అవసరమైనంత లేక పోతే ఎన్ని శిక్షణా తరగతలు నిర్వహించినా ఏం ప్రయోజనం లేదంటున్నారు సంఘాల నేతలు. వీఆర్వోలు ఈ పోర్టల్‌ను వినియోగించిన సమయంలోనూ ఇవే సాంకేతిక సమస్యలు తలెత్తేవన్నారు. అందుకే భూముల వివరాలు పోర్టల్‌లో అప్లోడ్ చేసేందుకు అనేక ఇబ్బందులు పడేవారమని, తామేదో పనిచేయడం లేదని, లంచాలు తీసుకుంటున్నారని సాకులు చూబుతూ ఆ వ్యవస్థనే లేకుండా చేశారని వాపోతున్నారు. ప్రభుత్వం, ఐటీ విభాగం చేసిన తప్పిదాలకు తమను బలిచేయడం దురదృష్ట కరమని అంటున్నారు. ఇప్పటికైనా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ధరణీ పోర్టల్‌ను ప్రారంభించినా ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.











