తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సహేతుకంగా లేదని, కొందరు వ్యక్తులచే ప్రభావితమై విడుదల చేసినట్లుగా కనిపిస్తోందని నిర్మాతల మండలి కార్యదర్శి మోహన్ వడ్లపట్ల అభిప్రాయపడ్డారు. పది కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్ మెంట్ ఇస్తామంటూ ప్రకటించడం కరెక్ట్ కాదని, అంత మొత్తం చాలా ఎక్కువని అన్నారు. కేవలం మూడు కోట్ల లోపు సినిమాలకు మాత్రమే అలాంటి రాయితీలను ప్రకటిస్తే బావుండేదని అన్నారు.
ఇక థియేటర్లను ఎప్పుడు పునః ప్రారంభించుకోవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం థియేటర్ల నిర్వాహకులకే వదిలిపెట్టడం సరికాదన్నారు. థియేటర్లను ఎప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు? అనే విషయంపై స్పష్టమైన సూచనలు చేస్తే బావుండేదన్నారు. అలాగే డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం సమస్య కూడా ఛాలా తీవ్రంగా ఉందని, దీనిని పరిష్కరించడంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.











