నేడు, రేపు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి రాజకీయ పార్టీలకు సమయం ఉంది. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ రెండు రోజులే పార్టీలకు కీలకం. దీంతో ఆయా పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచేశాయి. అధికార, విపక్ష పార్టీ నేతలు ఎన్నికల క్యాంపెయిన్‌లో బిజీబిజీగా పాల్గొంటున్నారు. రోడ్ షోలు, బస్తీ పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. వీలైనన్నీ డివిజన్లను కవర్ చేసేలా జాగ్రత్తలు పడుతున్నారు.
గల్లీగల్లీ తిరిగి తమకే ఓటు వేయాలని ఆయా పార్టీల అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. అయితే రేపు సాయంత్రంతో ప్రచారానికి తెరపడడంతో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్, పోలీసు శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అక్రమ మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా గట్టి నిఘాను పెట్టింది. డిసెంబర్ 1 మంగళవారం పోలింగ్ జరగనుంది. శని, ఆది, సోమవారాలు ఎన్నికల అభ్యర్థులకు కీలకం కానున్నాయి. ఇన్ని రోజులు ప్రచారం చేయడం ఒక ఎత్తు.. చివరి రెండు రోజులు పోల్ మేనేజ్‌మెంట్ చేయడం మరో ఎత్తు.
ఎన్నికల ప్రచార ప్రక్రియపై దృష్టి పెట్టే పార్టీలు చివరి రెండు మూడు రోజులను చాలా కీలకంగా తీసుకుని ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తుంటాయనే ఆరోపణ ఉంది. గుట్టుచప్పుడు కాకుండా మద్యం, డబ్బు, కానుకలు, విలువైన వస్తువులను పంపిణీ చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అసోసియేషన్ల వారిగా, ఉద్యోగ సంఘాలు, పొదుపు గ్రూపు సంఘాలు, కమ్యూనిటి అసోసియేషన్లు, యూత్ అసోసియేషన్లతో స్థానిక నేతలు ఇప్పటికే టచ్‌లో ఉంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటింటీ ప్రచారం చేసేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను రెడీ చేసుకున్నట్లు సమాచారం. వీరంతా రాత్రి వేళల్లో ఓటర్లను కాకపట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం ముగియగానే రహస్య క్యాంపెయినింగ్‌కు సిద్ధమవుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి డిసెంబర్ 1 వరకు, తిరిగి డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మద్యం షాపులను మూసివేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. దీనికనుగుణంగానే కొంత మంది నేతలు ముందస్తుగానే మద్యాన్ని ఈ రోజు భారీగా రవాణా చేసి ఎన్నికల ముందు రోజు పంపిణీ చేసేందుకు పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఏ పార్టీ కూడా మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు పోలీసు శాఖ గట్టి నిఘా పెట్టింది.
Must Read ;- ఎంఐఎం పార్టీలో మేనిఫెస్టో ఉండదు.. రాత్రి వేళల్లో సభలు మాత్రమే!!