భార్యాభర్తల మధ్య విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సంసార జీవితంలో భాగస్వామి లైంగిక పటుత్వం గురించి తప్పుడు ప్రచారం చేయడం క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దిగువ కోర్టు ఓ పురుషుడికి మంజూరు చేసిన విడాకుల్ని ఢిల్లీ హై కోర్టు సమర్థించింది. తన భర్త నపుంసకుడని, భార్య రాతపూర్వక వాంగ్మూలంలో చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, క్రూరమైనవని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అతని ప్రతిష్టను, మానసిన ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని ధర్మాసనం మండిపడింది. తన భర్త సంసారానికి పనికి రాడంటూ ఓ మహిళ చెప్పడం చట్ట ప్రకారం క్రూరత్వమేనని తేల్చిచెప్పింది.
దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన అపీల్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
అసలేమిటీ గొడవ?
ఎనిమిదేళ్ల కిందట ఓ వ్యక్తి, ఒకామెను రెండో వివాహం చేసుకున్నారు. అది ఆమెకు మొదటి పెళ్లి. పెళ్లి తరవాత ఆమె మానసిన స్థితి తెలిసి షాక్ అయ్యాడు. ఆమె మానసిక స్థితి తెలిస్తే పెళ్లి చేసుకునే వాడిని కాదని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. జిల్లా కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే తన భర్త నపుంసకుడని అతని భార్య ఢిల్లీ హైకోర్టులో అపీల్ చేసింది. డాక్టర్లు కూడా సాక్ష్యం చెప్పాక ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని కోర్టు తేల్చింది. ఇలాంటి ఆరోపణలు చేయడం క్రూరత్వమేనని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానం ముందు ఎవరిపైన అయినా ఆరోపణలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే పర్యవసానాలు తప్పవని కోర్టు ఆమెను హెచ్చరించింది.











