అనగనగా ఒక ఆకతాయి వెధవ ఉన్నాడు. వాడి పేరు పి.కిరణ్ కుమార్. సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామానికి చెందిన వాడు. చదువుకున్నవాడే. కానీ పర్వర్టెడ్ కామాంధుడు. ఫేస్ బుక్ పరిచయాల ద్వారా.. ఇవాళ్టి రోజుల్లో అమ్మాయిలకు ఎన్నెన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటి కేసుల్లో ఈ పర్వర్ట్ కిరణ్ ది ఇంకో రకం కహానీ. మొత్తానికి వీడి ఫేస్ బుక్ పర్వర్ట్ పనుల బారిన పడిన ఒక బాధి అమ్మాయి కంప్లయింటు ఇవ్వడంతో సైబర్ క్రైం పోలీసులు వీడి కథేంటో తేల్చారు. ఆచూకీ తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా వీడు సాగిస్తున్న వెధవ్వేషాలను.. ఐపీ అడ్రసన్ ద్వారా రాబట్టారు. కటకటాల్లోకి నెట్టారు.
ఏం చేసేవాడు..
ఇంతకూ ఈ కిరణ్ ఏం చేసేవాడో తెలుసా? ఫేస్ బుక్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలు డౌన్ లోడ్ చేసుకొని.. వాటి ద్వారా వారి పేర్లతోనే నకిలీ అకౌంట్ క్రియేట్ చేసేవాడు. అక్కడినుంచి ఆ అమ్మాయి పేరుమీదనే.. ఆ అమ్మాయి పాత అకౌంట్ ద్వారా ఆమె ఫ్రెండ్స్ ని కొత్త అకౌంట్ లో కూడా ఫ్రెండ్స్ గా మార్చుుకునేవాడు. అక్కడినుంచి వారితో అసభ్య చాటింగ్ చేస్తుండేవాడు. అమ్మాయి లాగా వారి సెక్స్ చాట్ చేసేవాడు.
ఎలా బయటపడింది?
ఇలాంటి చాటింగ్ వల్ల.. ఆ అమ్మాయిలకు వారి ఫ్రెండ్స్ నుంచి ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదురయ్యేవి. అయితే ఈ వ్యవహారం ఎలా జరుగుతోందో తెలిసేది కాదు. తమను ఇలా ఎవరు ఇబ్బంది పెడుతున్నారో కూడా వారికి తెలిసేది కాదు. నిజానికి ఇలాంటి ఆకతాయి పర్వర్ట్ వేషాల వల్ల వాడికి ఏం లాభించేదో కూడా తెలియదు.
కానీ, ఓ బాధిత యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా.. నిందితుడు కిరణ్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ ప్రబుద్ధుడు కిరణ్ కుమార్ ఇప్పటికే ఇదే తరహాలో 10 మంది అమ్మాయిలను వేధించినట్లు పోలీసుల విచారణ లో వెల్లడి అయింది.
ఇతనిపై ఇప్పటికే సూర్యాపేట, కోదాడ పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. అయితే.. తాజాగా సైబర్ క్రైం పోలీసులు మాత్రం.. వీడి భరతం పట్టి, గుట్టు తేల్చి.. జైల్లోకి నెట్టారు.











