వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మానసపుత్రిక సాక్షి మీడియా కొత్త కుట్రకు తెరలేపింది. విజయవాడ వరదల సాక్షిగా సంబంధం లేని కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇంత హృదయ విదారక ఘటనను ఇలా తన స్వలాభం కోసం వాడుకోవడం అటు జగన్‌కు, సాక్షి పత్రికకే చెల్లింది. విజయవాడ వరదల నేపథ్యంలో ఇక అమరావతి రాజధానిగా పనికిరాదంటూ కథనాలను వండి వారుస్తుంది.
హైకోర్టుకు సెలవులు ఇచ్చారని, సచివాలయాన్ని ఖాళీ చేసేశారని, గ్రామాలు మునిగిపోయాయని పచ్చి అబద్ధాలతో సాక్షి పత్రికలో బుధవారం నాడు కథనాలను ప్రచురించారు. కానీ, ఇందులో ఏ ఒక్కటీ నిజం కానే కాదు. జగన్ మీడియా ఇలా ఫేక్ వాదనలను తెరపైకి తేవడంతో స్థానికులైన రాజధాని ప్రాంత ప్రజలు పలువురు ప్రస్తుతం హైకోర్టు, సచివాలయ ప్రాంతాలు ఉన్న తీరును వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి వరద ముంపు లేదు. సాక్షి తప్పుడు కథనాలకు కౌంటర్ గా స్థానికులైన ప్రజలే నిజానిజాలను బయటకు తెచ్చారు.
పైగా సాక్షి మరో వాదనను కూడా తెరపైకి తెచ్చింది. అసలు అమరావతి రాజధానికి పనికి రాదంటూ శివరామక్రిష్ణ కమిటీ తెచ్చిందంటూ మరో కథనం రాసింది. పైగా కృష్ణా నది కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయమని.. ఆ గ్రామాల ప్రజలు కరకట్ట వెంబడి కాపలా కాశారని జనాల్ని నమ్మిస్తూ రాసిన కథనాలు స్థానికులకు నవ్వు తెప్పిస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం విజయవాడను ముంచెత్తిన వరద క్రిష్ణా నది వల్ల కాదనే కనీస జ్ఞానం లేకుండా సాక్షి ఇలా తప్పుడు వార్తలు రాయడం పలువురికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
బుడమేరు వాగు పొంగడం ద్వారా విజయవాడకు ఈ పరిస్థితి వచ్చిందని అందరికీ తెలుసు. ఆ వాగుకు గతంలో ఉన్న కరకట్ట స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే లే అవుట్లు వేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ల కింద మార్చి అమ్మేశారు. అవి కొనుక్కున్న ప్రజలు వారికి ఈ విషయం తెలియక ఇళ్లు కట్టుకున్నారు. ఆ కరకట్ట లేకపోవడం కారణంగానే బుడమేరు పొంగి ఇలా అనేక ప్రాంతాలను ముంచింది. కానీ, సాక్షి పత్రిక మాత్రం వింత వాదనలను తెరపైకి తెచ్చి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది.