రాజశేఖర్, గోపీచంద్ గతంలో ఎప్పుడూ కలిసి నటించకపోయినా.. వీరిద్దరికీ సంబంధించి ఒక విశేషముంది. రాజశేఖర్ ను ‘వందేమాతరం’ సినిమాతో హీరోగా చిత్ర సీమకు పరిచయం చేసింది గోపీచంద్ తండ్రి దివంగత దర్శకుడు టి.కృష్ణ. ఆ తర్వాత రాజశేఖర్ .. ఆయన దర్శకత్వంలో ‘ప్రతిఘటన, రేపటి పౌరులు’ లాంటి సినిమాల్లో కూడా నటించి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు రాజశేఖర్ టి.కృష్ణ తనయుడు గోపీచంద్ తో కలిసి నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
టీ.కృష్ణను గురువుగా భావించే రాజశేఖర్ .. ఆయన తనయుడు గోపీచంద్ తో కలిసి నటించే అవకాశమొస్తే .. నో చెప్పలేరు. అందుకే దర్శకుడు శ్రీవాస్ అడగ్గానే ..గోపీచంద్ తో మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. గోపీచంద్ తో గతంలో లక్ష్యం, లౌక్యం అనే సినిమాలు రూపొందించారు శ్రీవాస్. ఈ రెండూ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయనతో మరో సినిమా చేయడానికి గోపీచంద్ అంగీకరించారని తెలుస్తోంది.
ప్రముఖ వ్యాపార వేత్త ఈ మల్టీస్టారర్ ను నిర్మించబోతున్నారు. ఆ మేరకు సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మొదలు పెట్టారట. కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాకా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్, మర్మాణువు అనే రెండు వెరైటీ మూవీస్ ను లైన్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు గోపీచంద్ తో మల్టీస్టారర్ కు కూడా కమిట్ అవుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి ఈ మల్టీస్టారర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.