సూపర్ స్టార్ కృష్ణ, ఆదుర్తి సుబ్బారావు అపూర్వ కలయికలో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘గాజుల కిష్టయ్య’. రవికళా మందిర్ బ్యానర్ పై.. ఆదుర్తి భాస్కర్, యం.యస్. ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 1975, అక్టోబర్ 9న విడుదలైంది. సరిగ్గా నేటికి 45 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటీమణి జరీనా వహాబ్ కథానాయికగా పరిచయం అయింది. ఇంకా కాంతారావు, గిరిబాబు, సాక్షిరంగారావు, చంద్రమోహన్, అంజలీదేవి, నిర్మలమ్మ , పుష్పకుమారి, మాడా వెంకటేశ్వరరావు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
సత్యానంద్ మాటలు అందించగా.. కె.వి.మహాదేవన్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. గీతరచన ఆత్రేయ. ఇందులో ముఖ్యంగా నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు మాకు ఇవ్వమ్మా, ఇన్నిరోజులింత సొగసు లాంటి పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి.
కిష్టయ్య తమ్ముడు రాజిగాడుతో గాజులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తాడు. ఆక్రమం లో అతడికి రాధ పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. రాధ ఇంట్లో వారు కృష్ణను జైల్లో పెట్టించి ఆమెకి వేరే వాళ్ళనిచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. మరి కిష్టయ్య ఆ పెళ్ళిని ఆపి రాధను తిరిగి ఎలా దక్కించుకుంటాడు అనేదే మిగతా కథ. అప్పట్లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది.











