రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న ‘క్రాక్’లో భూమ్ బద్దల్ లిరికల్ వీడియో అదరగొడుతోంది. ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. ఇంకా ఒక పాట చిత్రీకరిస్తే సినిమా పూర్తయిపోతుంది. దీపావళి సందర్భంగా భూమ్ బద్దల్ పాటను విడుదల చేశారు. రవితేజ, అప్సరారాణిపై దీన్ని చిత్రీకరించారు. సంగీత దర్శకుడు తమన్ తరహా మాస్ బీట్ తో ఈ పాట ఉంది. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా సింహా, మంగ్లీ మంచి ఎనర్జీతో పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో దీన్ని చిత్రీకరించారు.
ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా ఇందులో కీలక పాత్రలను పోషించారు. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.