కడప జిల్లా రాయచోటికి చెందిన 30 సంవత్సరాల షేక్ హజీరాపై పోలీసులు సెక్షన్ 120 బి కింద క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. ఆమెపై కేసులు ఎందుకు పెట్టారో తెలిస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక పాలనలో ఉన్నామా అనే అనుమానం రాక మానదు. రాయచోటిలో హజీరా అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్నారు. భర్తతో విడాకులు తీసుకుని జీవితాన్ని నెట్టుకొస్తున్న తనపై మార్కెట్ యార్డు ఛైర్మన్ కుమారుడు లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతని ప్రయత్నాలు ఫలించకపోయేసరికి తనపై అసత్య ప్రచారం మొదలు పెట్టాడని హజీరా ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు, మార్కెట్ యార్డు ఛైర్మన్ కుమారుడు తనను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని హజీరా ఆ వీడియోలో వాపోయారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోగా పలు సెక్షన్ల కింద తనపైనే కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, తనను సీఎం జగన్మోహన్ రెడ్డి కాపాడాలంటూ ఆ వీడియోలో హజీరా కన్నీటి పర్యంతమయ్యారు.
హైకోర్టు స్టే ఉన్నా..
కొన్ని రోజుల కిందట హజీరా పనిచేసే అంగన్వాడీ కేంద్రం దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆమె కుటుంబంపై దాడి చేసి, కుటుంబ సభ్యులను కూడా గాయపరిచారని హజీరా వీడియోలో వివరించారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడైన మార్కెట్ యార్డు ఛైర్మన్ కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని హజీరా అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు విషయం చెప్పినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో హజీరా హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టే మరో రెండు వారాలు ఉన్నా పోలీసులు మధ్యంతర ఉత్తర్వులతో 500, 501, 120(బి) 506 సెక్షన్ల కింద తనను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని హజీరా ఆందోళన వ్యక్తం చేశారు.
శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నోటీసు జారీ
అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న హజీరాకు కడప జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నోటీసు కూడా జారీ చేశారు. తనను ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసివేయకూడదని ఆ నోటీసు సారాశం. అంగన్వాడీకి కేటాయించిన ఆహార పదార్థాలను అక్రమంగా తరలిస్తోందని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. విధులకు సరిగా రాకపోవడం, 90 శాతం హాజరు లేకపోవడంపై కూడా సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చారని హజీరా వీడియోలో వెల్లడించారు.
అంగన్వాడీ టీచర్‌గా చేస్తూ ప్రతి నెలా వచ్చే పదివేల జీతంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిని, తన ఇద్దరు మగ పిల్లలను పోషించుకుంటున్నానని హజీరా వీడియోలో వాపోయారు. పోలీసులతో కేసుల నమోదు చేయించడంతోపాటు, అంగన్వాడీ టీచర్ ఉద్యోగం కూడా తీసివేయాలని నోటీసులు పంపడం వెనుక స్థానిక వైసీపీ ఎమ్మెల్యే హస్తం ఉందని హజీరా తన సెల్ప్ వీడియోలో అభిప్రాయపడ్డారు.
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మరవక ముందే హజీరా ఉదంతం వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తోంది. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తే ఎంత తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో అబ్దుల్ సలాం ఉదంతం తెలియజేస్తోంది. రేపు హజీరాకు న్యాయం జరక్కపోతే ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. హజీరా ఉదంతం పరిశీలిస్తే ఈ సమాజంలో రాజకీయ నేతల అండలేకుండా బతకలేమా అనే అనుమానాలు కూడా రాకమానవు.










