కొన్ని అంచనాలు నిజమయ్యాయి. చాలా అంచనాలు తారుమారు అయ్యాయి. మొత్తానికి దుబ్బాక ప్రజలు విలక్షణమైన తీర్పు చెప్పారు. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక సంకేతం పంపారు. బీజేపీకి రాబోయే ఎన్నికల వరకు సరిపడా ఉత్సాహాన్ని నింపారు.
దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతను ప్రజలు ఓడించారు. మరణించిన నాయకుడి కుటుంబానికి టికెట్ ఇస్తే సహజంగా కలిసివస్తుందనుకునే సానుభూతి, ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది.. రాష్ట్రమంతా సానుకూల పవనాలు ఉన్నాయనే ప్రచారం, బీజేపీ రైతులకు ద్రోహంచేసే నిర్ణయాలు తీసుకుంటోందన్న ప్రచారం ఇవేమీ కూడా పనిచేయలేదు. ప్రజలు మాత్రం బీజేపీ రఘునందన్ రావుకు పట్టం కట్టారు.
తెరాసకు లాభమేంటి?
ఓటమి తర్వాత.. పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని, విజయాలకు పొంగిపోం, అపజయాలకు కుంగిపోం అని చెప్పారు. ఓటమిని అంగీకరించారు. ఓట్లు వేసిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్, హరీష్ రావు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని కూడా హరీష్ రావు ఒప్పుకున్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో దుబ్బాకలో పార్టీని గెలిపిస్తానని ప్రతిజ్ఞ చేసిన హరీష్ రావు ఓటమికి బాధ్యత తీసుకోడానికి జంకలేదు. ఓటమికి దారితీసిన కారణాలు విశ్లేషించుకుని.. భవిష్యత్తులో ముందుకుపోతాం అని కేటీఆర్ ప్రెస్‌మీట్ లో చెప్పిన మాటలే.. ఆ పార్టీకి ఈ ఫలితం వల్ల ఒనగూరిన అతి పెద్ద లాభం.
ఇప్పటిదాకా అలాంటి విశ్లేషణాత్మక దృక్పథం పార్టీలో కొరవడిందని అనుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రజలు టీఆర్ఎస్‌కు పట్టం కడుతున్నారు. 2018లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఊహించనంత అనన్యమైన విజయాన్ని కట్టబెట్టారు. కానీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి ఆ ఉధృతి కాస్త పలచబడింది. అయినప్పటికీ.. కేటీఆర్ ఇవాళ చెప్పినట్లుగా, ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషించుకోవడం అనే ప్రక్రియ ఇప్పటిదాకా జరిగినట్లు కనపడడం లేదు. మరో కోణంలోంచి చూసినప్పుడు.. అలాంటి అవసరం తమకు లేదనే ధీమా మాత్రమే వారిలో ఇన్నాళ్లుగా ఉంది.
తమ ప్రభుత్వం ఏం చేస్తే అదే సంక్షేమం, ఏం మాట్లాడితే అదే ప్రజాహితం, తీసుకున్న నిర్ణయాలే అద్భుతాలు అన్నట్లుగా తెరాస పాలన సాగిపోతూ వచ్చింది. దుబ్బాకలో విజయం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోయేది కాదని పార్టీ నమ్మకంగా ఉంది. సానుభూతి, హరీష్ రావు వ్యూహచాతుర్యం అన్నీ పనిచేస్తాయని వారు అనుకున్నారు. సాధారణంగా అంచనాలన్నీ అలాగే సాగాయి. ఒకటి రెండు సర్వేలు బీజేపీ అనుకూల ఫలితాన్ని సూచించాయి. నిన్న లియోన్యూస్ ప్రస్తావించిన ఆరా సర్వేలో కూడా టీఆర్ఎస్‌కు 48, బీజేపీకి 44 శాతాలు పేర్కొని మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండవచ్చునని అన్నారు. బీజేపీకి ప్లస్ అయింది, తెరాసకు మైనస్ అయింది. వెరసి విజయం మారిపోయింది.
ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడానికి టీఆర్ఎస్‌కు దుబ్బాక ప్రజలు ఇచ్చిన మహదవకాశం ఇది. ఇప్పటిదాకా తాము చేసిన ప్రతి పనీ అద్భుతం అని వారు అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు తాము చేసిన, చేస్తున్న ప్రతిపనినీ ఒకటికి రెండుసార్లు తూకం వేసుకోక తప్పదు.
బీజేపీకి లాభమేంటి?
17 ఎంపీ నియోజకవర్గాలున్న తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీకి చాలా ఆశలున్నాయి. 25 సీట్లున్న ఏపీలో ఎటూ ఇప్పట్లో ఆ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. తెలంగాణ మీద ఆశలున్నాయి. ఆ ఆశలు ఇప్పుడు మరింత పెరిగాయి. బీజేపీ అంటే కేవలం హైదరాబాదు నగరానికి మాత్రమే పరిమితమయ్యే పార్టీ కాదని రాష్ట్ర ప్రజలకు నిరూపించడానికి వారికి ఇది మరో అవకాశంగా అందివచ్చింది. ప్రభుత్వం పనితీరు సజావుగా లేదని ప్రజల్లోకి మరింత గట్టిగా దూసుకెళ్లడానికి ఈ విజయం వారికి ఉపయోగపడుతుంది. అంతిమంగా రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకూ బలపడుతున్నదనడానికి సంకేతం ఇది.
ప్రజలకు లాభమేంటి?
ఈ విజయం వల్ల రాష్ట్ర ప్రజలకు ఒనగూరిన లాభం మరొకటి ఉంది. అది ప్రతిపక్షం బలపడడమే. బీజేపీనా? కాంగ్రెసా? అనేది అప్రస్తుతం. కానీ 2014లో తెరాస విజయం సాధించిన నాటినుంచి అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నదా అని సందేహించే వాతావరణం చాలా సందర్భాల్లో ఏర్పడింది. బలమైన ప్రతిపక్షం లేకపోవడం అనేది పాలకపక్షం యథేచ్ఛగా వ్యవహరించడానికి కూడా దారితీస్తుంది.
దుబ్బాక ఉపఎన్నికను కేవలం ఒక నియోజకవర్గపు ఉపఎన్నికగా పరిగణించడానికి వీల్లేదు. రాష్ట్రప్రభుత్వానికి అది హెచ్చరిక. ప్రతిపక్షం బలపడుతుండడానికి సంకేతం. పాలకపక్షం పట్ల ప్రజల్లో వ్యతిరేకతకు నిదర్శనం. ఈ సూచనను సరిగ్గా అందిపుచ్చుకుంటే.. కాంగ్రెస్ పార్టీ కూడా తమకు పట్టుఉన్న ప్రాంతాల్లో మరింత బలంగా తయారుకావొచ్చు. ప్రత్యర్థులు బలంగా ఉండడం అనేది ప్రభుత్వంలో అప్రమత్తతను, జాగరూకతను పెంచుతుంది. అలసత్వాన్ని తగ్గిస్తుంది. అంతిమంగా రాష్ట్రానికి, ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుంది. అందుకే భిన్నమైన తీర్పు ఇచ్చిన దుబ్బాక ప్రజలకు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి.
దేశమంతా కమలపరిమళాలే..
మోడీ హవా ఇంకా సజీవంగా ఉంది అని ఈ ఎన్నికలు నిరూపించాయి. బీహార్ లో అనేక దోబూచులాటల మధ్య బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ఎన్డీయే కూటమి.. నితీశ్ నే తమ సారథిగా ప్రకటించి.. మరోసారి అధికారం దక్కించుకునే దిశగా వెళ్తోంది. మధ్యప్రదేశ్‌లో అనైతికమైన ఫిరాయింపులతో ఉపఎన్నికలకు కారణమైన బీజేపీని ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు. రాష్ట్రంలో కేసీఆర్ హవా పలచబడింది.. కానీ ఇతర రాష్ట్రాల ఫలితాల సరళిని కూడా పరిశీలించినప్పుడు మోడీ హవా మరింత పెరుగుతోంది.
.. సురేష్ పిళ్లె
[email protected]