ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంతో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు అనేక విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. TCS, కాగ్నిజెంట్ లాంటి ప్రముఖ సంస్థలు త్వరలోనే క్యాంపస్‌లు ప్రారంభించనున్నాయి.
తాజాగా టెక్స్‌టైల్ రంగంలో పేరెన్నికగన్న రేమండ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 12 వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని రేమండ్ ఆలోచిస్తున్నట్లు మనీ కంట్రోల్ తెలిపింది. దుస్తులు, ఆటో కంపోనెట్స్‌తో పాటు ఏరోస్పేస్ తయారీ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టాలని రేమండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భవిష్యత్‌లో వివిధ రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించాలన్న ఆలోచన మేరకు ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రేమండ్ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2023లో మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్‌లో ₹682 కోట్ల విలువైన 59.25 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా రేమండ్ కంపెనీ ఏరోస్పేస్, రక్షణ రంగంలోకి ప్రవేశించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రేమండ్ ఈ ప్రకటన చేసింది. ఇందులో భాగంగా రేమండ్‌కు పదేళ్ల పాటు 30 శాతం వరకు క్యాపిటల్ సబ్సిడీ అందించడంతో పాటు 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీని మినహాయించనుంది.
రేమండ్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. అనంతపురంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రేమండ్ ద్వారా 6500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే దుస్తుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న కిటెక్స్ సంస్థ సైతం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన విషయం తెలిసిందే.