వివేకా హత్య కేసు.. వైసీపీకి పెనుసవాల్ గా మారుతోంది.. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు జరిగి నాలుగేళ్లు. ఇంతవరకు నిందితులు ఎవరో తేలకపోవడం, సొంత కుటుంబ సభ్యులే ఆయనని అంతమొందించారన్న ఆరోపణలో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా ఈ కేసులో సీబీఐ విచారణ తుది అంకానికి చేరుకుంది.. దీంతో, తాను అనుకున్న వారిని కాపాడడానికి జగన్ చేయని ప్రయత్నం లేదనే చర్చ జరుగుతోంది.. మరోవైపు, ఈ కేసులో లేటెస్ట్ గా వెలుగులోకి వస్తున్న పలు అంశాలు జగన్ కి మింగుడు పడడం లేదు. ముఖ్యంగా ఏబీఎన్ అంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో ప్రస్తావించిన అంశాలకు సమాధానం ఎవరు చెబుతారనేది చర్చనీయాంశంగా మారుతోంది.. ఆర్ కే లీక్ చేస్తున్న అంశాలు.. వైసీపీకి షాకింగ్ గా మారుతున్నాయి..
వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో నలుగురు సాక్ష్లుల గురించి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో ఇప్పటివరకు వెలుగులోకి రాని పలు అంశాలను ప్రస్తావించారు. సీబీఐకి ఆయన ఓపెన్ గా వాటిపై విచారణ జరపాలనే విధంగా సమాచారం ఇచ్చారనే చర్చ సాగుతోంది.. వివేకా హత్య కేసు సీఎం జగన్ దంపతులకు తెల్లవారుజామున నాలుగున్నరకే తెలుసని తెలిపారు.. ఆ సమయంలో జగన్ తోపాటు మరో నలుగురు ఉన్నారని వివరించారు.. ఆ నలుగురు ఎవరంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ, పీఏ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ సీఎస్ అజేయ కల్లాం. ఈ నలుగురిని సీబీఐ విచారిస్తే.. అసలు గుట్టు బయటపడుతుందని.. ఆర్ కే చెబుతున్నారు.. ఈ నలుగురిలో ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎందుకంటే ఆయన ఫోన్‌కే అవినాష్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. మిగతా ముగ్గురిని కూడా ప్రశ్నిస్తే పలు కీలక అంశాలు వెలుగులోకి రావడం ఖాయమని చెబుతున్నారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ..
అయితే, ఆర్ కే.. ఈ అంశాన్ని ఈ ఆర్టికల్ లో ఇంత బలంగా ప్రస్తావించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయనే చర్చ సాగుతోంది.. ఆ నలుగురిలో ఒకరు ఆర్ కేకి ఈ కీలక సమాచారాన్ని లీక్ చేసి ఉంటారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.. ఈ నలుగురిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీని వీడి జగన్ కి దగ్గరయ్యారు.. మాజీ ఐఏఎస్ అధికారి అజేయ కల్లాం సర్వీస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ తో క్లోజ్ గా ఉన్నారు.. ఇక మిగిలిన ఆ ఇద్దరు దువ్వూరి కృష్ణ, కృష్ణమోహన్ రెడ్డి మొదటి నుంచి జగన్ తోనే ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ఈ విషయం ఆర్కేకు లీక్ చేసి ఉంటారన్నది జగన్ క్యాంప్ లో టెన్షన్ పుట్టిస్తోంది.. ఈ నలుగుర్ని సీబీఐ ప్రశ్నిస్తుందా లేదా అన్నది తర్వాత విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి దంపతుల పాత్ర వివేకాహత్యలో ఉందని బలంగా నమ్మించడంలో ఆర్ కే గట్టి వాదనను తన వీకెండ్ కామెంట్ ద్వారా వివరించడంలో సక్సెస్ అయ్యారని భావిస్తున్నారు.
వైఎస్ వివేకాహత్య కేసులో జగన్ సొంత మీడియా పలు కథనాలను ప్రచురిస్తోంది.. ఈ కేసులో వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని సీబీఐ ఎందుకు వదిలేసిందని నిలదీస్తోంది.. ఇటు, వివేకా రెండో భార్య షమీమ్ బేగమ్ వాంగ్మూలాన్ని సీబీఐ ఎందుకు లైట్ తీసుకుంటోందని ప్రశ్నిస్తోంది జగన్ అనుకూల మీడియా.. మరోవైపు, అవినాష్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరుకుంటోంది.. వీటి అన్నింటికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్ కే రాస్తోన్న వీకెంట్ కామెంట్ కౌంటర్ గా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ అనుకూల మీడియా కథనాలకు సమాంతర దర్యాప్తునకు కౌంటర్‌గా ఆర్ కే ఈ ఆర్టికల్ రాసినట్లుగా ఉంది. ఆయన సీబీఐ కంటే సంచలనాత్మక విషయాలు బయటపెడుతున్నారు. మొత్తంగా ఓ క్రమ పద్దతిలో చెప్పి ఫ్లాష్ బ్యాక్‌ను.. వివేకా హత్యకు దారి తీసిన పరిస్థితుల్ని విశ్లేషించి అసలేం జరిగిందో అర్థం చేసుకోమని ప్రజలకు చెబుతున్నారు. వివేకా హత్య వెనుక మాస్టర్ ప్లానర్లు జగన్, భారతినేనని ఆర్ కే పరోక్షంగా చెప్పేస్తున్నారు. మరి, రాబోయే రోజులలో ఏం జరుగుతుందో చూడాలి..