వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖామంత్రిగా, ప్రభుత్వ సలహాదారుగా కీలక పాత్ర పోషించిన సజ్జల రామకృష్ణా రెడ్డికి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి పెద్ద పీట వేశారు.. ఇటీవల ప్రకటించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సజ్జలకి చోటు దక్కింది.. ఆ కమిటీ కన్వీనర్‌గా ఆయనను నియమించారు జగన్.. ఇదే ఇప్పుడు వైసీపీలో చిచ్చుకు కారణం అవుతోందనే లీకులు వస్తున్నాయి..
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాభవానికి సజ్జల కారణమని ఆ పార్టీలో అంతర్గత చర్చ ఉంది.. ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, బయటకు వచ్చిన నేతలంతా సజ్జలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.. అధికారంలో ఉన్న సమయంలో దారుణమైన నిర్ణయాలు తీసుకొని జగన్‌ని తప్పు దారి పట్టించారని, ఈ విధానాలు, వ్యూహాలే ఏపీ రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీకి దక్కని ఘోర ఓటమిని కట్టబెట్టాయని గుర్తు చేస్తున్నారు.. ఓటమి తర్వాత ఆయనని పక్కన పెట్టాలని, పార్టీకి దూరంగా ఉంచాలని ఇప్పటికే అనేకమంది నేతలు, కార్యకర్తలు జగన్‌కి ప్రత్యక్షంగా, పరోక్షంగా మొర పెట్టుకున్నారు.. సజ్జల పార్టీ పుట్టి ముంచారని ఆవేదన వ్యక్తం చేసినా, తమ పార్టీ అధినేత జగన్ ఆలకించడం లేదని, ఇద్దరి మధ్య ఎలాంటి అండర్ స్టాండింగ్ ఉందో తెలియడం లేదని వాపోతున్నారు..
సజ్జలని దూరం పెట్టనంత కాలం వైసీపీకి పరాభవం తప్పదని, జగన్ కోలుకోలేడని పదే పదే కడుపు చించుకుంటున్నారు కొందరు నేతలు, కార్యకర్తలు.. ఆయనపై ఇటీవల ఆ పార్టీ సానుకూల పత్రికలు, యూ ట్యూబ్ చానెల్స్, సోషల్ మీడియా వేదికలపైనే నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి.. భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.. అయినా, జగన్‌లో కించిత్ ఆలోచన కలగడం లేదని, సజ్జల ఒక ఐరన్‌లెగ్‌లాగా తమ పార్టీని ముంచుతున్నాడని రగిలిపోతున్నారు కొందరు నేతలు..
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్‌ని తట్టుకోవడం జగన్‌కి అసాధ్యంగా కనిపిస్తోందని, దీనిలో భాగంగానే సజ్జలని త్వరలోనే బలిపశువుని చేయడానికి ఓ ఎత్తుగా కొందరు భావిస్తున్నారు.. మరికొందరు మాత్రం, జగన్‌లో ఎలాంటి మార్పు లేదని, తాను మారానని, రాబోయేది జగన్ 2.ఓ అని పైకి మాత్రమే చెబుతున్నారని, ఆయన గుండెల్లో భయం వెంటాడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. దీంతో, సజ్జలని ఉంచినా, మార్చినా ఎలాంటి రాజకీయంగా ప్రస్తుతం తమ ఫేట్ మారే చాన్స్ లేదని భావించిన జగన్… ఆయనని కొనసాగిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.. ఏది ఏమైనా, సజ్జలపై పార్టీలో మెజారిటీ నేతలు ఉడికిపోతున్నారు.. కొందరు ఓపెన్‌గా బయటపడుతుండగా, మరికొందరు లోలోపల మధనపడుతున్నారు.. మరి, ఈ అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలు అవుతుందో చూడాలి..