మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ RK రోజా హైకమాండ్‌పై ఆగ్రహంతో ఉన్నారా, అంటే అవుననే మాటే వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు, తర్వాత జరుగుతున్న వరుస పరిణామాలతో రోజా తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీకి చెందిన కొంత మంది పెద్ద మనుషులే నగరి నియోజకవర్గంలో రాజకీయంగా తన ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారని రోజా ఆరోపిస్తున్నారు..
ఇటీవల డిసెంబర్ 11న జరిగిన MPP బై ఎలక్షన్లలో విజయపురం, నిండ్ర మండలాలు టీడీపీకి దక్కాయి. ఐతే దీని వెనుక పార్టీలోనే కుట్ర జరిగిందని రోజా చెబుతున్నారు. శ్రీశైలం పాలక మండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి రెడ్డి సహా పలువురు నేతలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారంటూ రోజా ఫైర్ అవుతున్నారు. తనను అప్రతిష్టపాలు చేయడానికి నగరి నియోజకవర్గంలో సొంత పార్టీలోని పెద్ద నాయకులే కుట్ర చేస్తున్నారనేది రోజా ప్రధాన ఆరోపణ..
అంతేకాదు, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే పార్టీలో కొంతమందిని తనకు వ్యతిరేకంగా తయారు చేశారని, అలాంటి వారికి మైన్స్, ఇతర పనుల్ని అప్పగించి, ఆర్థికంగా బలోపేతం చేశారని రోజా చెబుతున్నారు. అలాంటి వాళ్లను టీడీపీలోకి పంపి, గత సార్వత్రిక ఎన్నికల్లో తనను సొంత పార్టీ నేతలే ఓడించారని రోజా మండిపడుతున్నారు..
నగరిలో తనను ఓడించడం ద్వారా వైసీపీకి రాజకీయంగా సొంత పార్టీ నేతలే నష్టం చేశారంటున్నారు రోజా మరోవైపు కొంతమంది పెద్ద మనుషులు జగన్ వద్ద పలుకుబడిని దుర్వినియోగం చేస్తున్నట్టు రోజా ఆరోపిస్తున్నారు. వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే వారి విషయంలో తాడేపల్లి ఆఫీసులోని పార్టీ పెద్దలు సైలెంట్‌గా ఉండడాన్ని రోజా జీర్ణించుకోలేకపోతున్నారు. నిండ్ర, విజయపురం ఎంపీపీ స్థానాలు టీడీపీకి దక్కడం వెనుక కొంత మంది పార్టీ పెద్దల వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు.
….
కొద్దిరోజులుగా వైసీపీ హైకమాండ్ తీరుపై రోజా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె వైసీపీకి ఏ క్షణమైనా గుడ్‌బై చెప్పే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె తమిళనాడు పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తారని, విజయ్‌కు చెందిన కొత్త పార్టీలో ఆమె చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది..











