సొంతపార్టీ వారిపై కూడా నిరంకుశత్వమా..!
రాజకీయ పార్టీకి పునాదులు కార్యకర్తలైతే.. లోకల్ నాయకులు పిల్లర్ లాంటివాళ్లు! ప్రజలు ఛీకొట్టిన పార్టీ జెండా మోసేది, నేతలుకు ప్లెక్సీలు కట్టేది, నాయకుడికి జై కొట్టెది కార్యకర్తలే!! కార్యకర్తలను సమతాటిపైకి తీసుకొచ్చి.. పార్టీని ముందుకు తీసుకుపోయేది లోకల్ నాయకత్వమే! అటువంటి లోకల్ నాయకత్వపై అధికార వైసీపీలో నిర్లక్ష్యం ఆవహించింది!! చీమల పెట్టిన పుట్టలో పాములు మాదిరిగా వైసీపీ ఎమ్మెల్యేలు ఏపీలో రాజ్యమేలుతున్నారు. ఈ కారణంగా అధికారపార్టీలో ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అడుగు ముందుకేసి పార్టీ అంతర్గత వైఫల్యాలను వేలెత్తిచూపితే సొంతవారే అనికూడా చూడకుండా నాయకులపై కేసులు కట్టి, కటకటాల పాలు చేస్తున్నారు. లేకుంటే దాడులు చేసి, కుటుంబ సభ్యులను సైతం బెదిరిస్తున్నారు. వైసీపీలో సీనియర్ నేతలు సైతం ఇదేక్కడ సంస్కృతి అని ముక్కున వేలేసుకుని మగ్గిపోతున్న పరిస్థితి!
స్వపక్షమే.. విపక్షమైతే.. కాడిమోసేది ఎవరు?
జగన్ రెడ్డి అండ్ కో చేస్తున్న చర్యలకు స్వపక్షమే.. విపక్షం మాదిరిగా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రోజురోజుకు అధికారపార్టీలో అసంతృప్తి వాదుల సంఖ్య పెరుగుతోంది వస్తోంది! అటువంటి వ్యక్తులను కూర్చోపెట్టి బుజ్జగించడం మాని.. వారిపై దాడులకు పాల్పడుతున్నారు. కేసులు పెట్టి అత్యంత నీచమైన చర్యలకు తెరతీస్తున్నారు. ఇదేక్కడి సాంప్రదాయమని అధికారపార్టీ పెద్దలు సైతం హెచ్చరిస్తున్నా.. పార్టీలో మొండి ఇటువంటి చర్యలు మాత్రం ఆగడం లేదు. ఇలా అధికార చర్యలు కంటిన్యూ అయితే.. పార్టీ జెండాలను కూడా పట్టుకునేందుకు మండలాల్లో వైసీపీకి నాయకులు, కార్యకర్తలకు కరువయ్యే పరిస్థితి దాపురించడం తథ్యం! చివరికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటించాలన్నా.. కూలిచ్చి ఫ్లెక్సీలను, జెండాలను మోపించుకోవాల్సిన పరిస్థితికి దిగాజారే రోజు అతి తొందర్లోనే ఉన్నదని హెచ్చరికలు లేకపోలేదు. మొన్న ప్రకాశం జిల్లా, ఒంగోలులో సొంత పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా పై ఆపార్టీ నాయకుడు సుబాని దాడి, నిన్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిని ప్రశ్నించారని జడ్పీటీసీ సభ్యురాలు భర్త, వైసీపీ నేత కొండ్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇటుంటివి దిగజారుడు రాజకీయాలకు అవసరమా? అని తంబళ్లపల్లె వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చర్యలను ఖండిస్తున్నారు. సొంత పార్టీలో వారినే ఇలా అరెస్ట్ చెయ్యడం ఏమిటని ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి చర్యలను నిలదీస్తున్నారు. ద్వారకనాథ్ రెడ్డి అరాచకాలు, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు.. తమపై కక్ష్య కట్టి ఇలా కేసులు బనాయిస్తున్నారని తంబళ్లపల్లె జడ్పీటీసీ గీత ఆరోపించారు. తన భర్త కొండ్రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని గీత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











