మేఘ ఆకాశ్ .. తెరపై ఈ అమ్మాయిని చూసి మనసు పారేసుకోని కుర్రాళ్లు లేరు. పడుచు హృదయాలను పారబోయని పిలగాళ్లు లేరు. అంతటి అందం .. ఆకర్షణ ఆమె సొంతం. అందం .. అభినయం ఉన్నాయి కదా అని అదృష్టం వెతుక్కుంటూ రాదు. అది వెతుక్కుంటూ వచ్చేవరకూ ఎవరైనా వెయిట్ చేయవలసిందే. ప్రస్తుతం మేఘ ఆకాశ్ అదే పని చేస్తోంది. ఆమె తాజా చిత్రంగా ‘డియర్ మేఘ’ రూపొందుతోంది. ఈ సినిమాపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది.
మేఘ ఆకాశ్ చేస్తున్న ప్రేమకథా చిత్రమే ‘డియర్ మేఘ’. మనసు ఒకరితో .. మనువు ఒకరితో అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా సాగుతుంది. అర్జున్ దాస్యం నిర్మిస్తున్న ఈ సినిమాకి, సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. హరి గౌర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి కొంత సేపటిక్రితం ‘గుండెల్లో కన్నీటి మేఘం’ అనే ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హరిణి ఆలపించారు.
ఈ పాట వింటుంటే .. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీ అనే అనిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికను తమ జీవితంలోకి ఆహ్వానించే కథానాయకులుగా అరుణ్ ఆదిత్ .. అర్జున్ సోమయాజుల కనిపిస్తున్నారు. ప్రస్తుతం మేఘ ఆకాశ్ చేతిలో ‘మనుచరిత్ర’ .. ‘గుర్తుందా శీతాకాలం’ .. ‘రాజ రాజ చోర’ ఉన్నాయి. అయితే పాత్ర ప్రాధ్యాన్యత రీత్యా ఈ సినిమాపై మేఘ ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం సహజమే కదా.