తెలుగు సినిమా.. ప్రపంచానికి ‘మాయా బజార్’ ని చూపించింది. ఆ గ్రాండియర్ తో ‘సింహాసనం’పై కూర్చోబెట్టినప్పుడే ఔరా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు.
మహానటులు ఎన్టీఆర్, ఏయన్నార్ లతో ‘అడవి రాముడు’, ‘ప్రేమాభిషేకం’.. లాంటి మూవీలతో ఏకంగా 365 రోజుల పాటు సినిమాని ఆడించగల సత్తా గల దర్శకులు ఎందరో మన చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కానీ.. తెలుగు సినిమాని ప్రపంచ చిత్ర పటంపై శిఖరాగ్రాన నిలబెట్టిన ఘనత మాత్రం దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. భారతీయ సినిమా పరిశ్రమలో హిందీ చిత్ర పరిశ్రమ తర్వాత ఇప్పుడు అందరి దృష్టినీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆకర్షిస్తోందంటే అంది రాజమౌళి చలవే. 50 ఏళ్ల క్రితం తెలుగు సినిమా 28 కేంద్రాల్లో 60 థియేటర్లలో విడుదలైతే అదో గొప్ప. విడుదలైన అన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంటే పెద్ద సంబరం.
కాలంమారింది.. కొత్త నీరు చేరింద.. తెలుగు సినిమాకి పాన్ ఇండియా పట్టాభిషేకం చేస్తోంది. దాదాపు 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెలుగు సినిమా తీయాలంటే ఎంతటి సాహసం చేయాలి. ఆ దర్శకుడి మీద నిర్మాతకు ఎలాంటి నమ్మకం ఉండాలి. అందుకే ఆ దర్శకుడిని నమ్మి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఆ దర్శకుడు సినిమాని అద్భుత కళాఖండంగా చెక్కుతూ ఏళ్ల తరబడి సమయం తీసుకున్నా చివరికి మహాద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు. అలాంటి మహాద్భుతం మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’గా మనముందుకు రాబోతోంది. అందరికీ సంక్రాంతి జనవరి 14న వస్తుందేమోగానీ ఈసారి మాత్రం జనవరి 7న ఈ సినిమా విడుదలతోనే పెద్ద పెండగ వచ్చేస్తోంది.
వెండి తెరలు దేదీప్యమానం
ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ సినిమా 10 వేల థియేటర్లలో విడుదల కాబోతోంది. రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 9 వేల థియేటర్లో విడుదలైనప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదెలా సాధ్యం అనుకున్నారు. ఈసారి ఆ సంఖ్య పది వేలకు చేరింది. ఒక్క అమెరికాలోనే 2500 థియేటర్లలో ట్రిపుల్ ఆర్ విడుదల కాబోతోంది. ఇక ఇండియాలో దాదాపు 2000 వేల మల్టీ ప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. వాటి అన్నిటిలోనూ ట్రిపుల్ ఆర్ ప్రదర్శితం కాబోతోంది. పీవీఆర్ సినిమాస్, కార్నివాల్ సినిమాస్, ఐనాక్స్, సినీపాలిస్, మీర్జా సినిమాస్, ప్రసాద్ మల్టీప్లెక్స్.. ఇలా వీటన్నిటిలోనూ ఆర్ఆర్ఆర్ బొమ్మ పడబోతోంది.
9 వేల థియేటర్లలో విడుదలైన బాహుబలి రూ. 250 కోట్ల వ్యయంతో రూపొంది తొలి రోజునే 200 కోట్లు వసూలు చేసింది. మరి ట్రిపుల్ ఆర్ ఈసారి రూ. 250 కోట్ల వసూళ్లను సునాయాసంగా వసూలు చేస్తుంనుకోవచ్చు. బాహుబలిలో ఒక్క ప్రభాస్ మాత్రమే ఉంటే ఈ ట్రిపుల్ ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. అందుకే ఈ సినిమా పరిధి మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ బిజినెస్ రూ. 325 కోట్ల మేర జరిగిందని తెలుస్తోంది.
భారీ వసూళ్ల దిశగా..
ట్రిపుల్ ఆర్ సినిమాతో కొత్త రికార్డుల కల్పన దిశగా అడుగులు పడబోతున్నాయి. ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించారు. అది కాకుండా ఇంగ్లీషులోకి కూడా అనువాదం చేయనున్నారు. మరి కొన్ని ఇతర భాషల్లోకి డబ్ చేయనున్నారు. కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీకి తెరతీసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అమీర్ ఖాన్ ‘దంగల్’ ఉంది. దాని తర్వాత స్థానం ఇప్పటిదాకా బాహుబలికే ఉంది.
ఇప్పుడు ట్రిపుల్ ఆర్ దాన్ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. ఇందులో భారీ తారాగణం కూడా దీనికి ప్లస్ పాయింట్. అటు హిందీ నుంచి అజయ్ దేవ్ గణ్, ఆలియా భట్, హాలీవుడ్ ఒలీవియా మోరిస్ అదనపు ఆకర్షణగా చెప్పాలి. ఈసారి సీక్వెల్ జోలికి పోకుండా ఒకే సినిమాతో కథను ముగించే ప్రయత్నం రాజమౌళి చేశారు. మరి ఏ స్థాయిలో వసూళ్లకు ఈ సినిమా తెరతీస్తుందో చూడాలి.











