ఎలాంటి గ్రాఫిక్స్ లేని రోజుల్లో అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరించిన ఘనత దర్శకుడు బి. విఠలాచార్యకే దక్కుతుంది. అందుకే ఆయనను జానపద బ్రహ్మ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో 15 మహానటుడు ఎన్టీఆర్ నటించినవే.
ఎన్టీఆర్, కాంతారావులు జానపద హీరోలుగా మాస్ ఇమేజ్ ను సంపాదించుకోవడంలో విఠలాచార్య పాత్ర ఎంతైనా ఉంది. అలాంటి విఠలాచార్య మీద ఓ పుస్తకం రాయడం విశేషం కాక ఇంకేమిటి. ఒకప్పుడు ఏ సినిమాకి వెళ్లావ్ అని ఎవరైనా అడిగితే విఠలాచార్య సినిమాకి అని జనం అనేవారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. ఆ సమగ్ర పుస్తకానికి ‘జై విఠలాచార్య’ అని పేరు పెట్టారు.
‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. ఈ పుస్తకం ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించడం విశేషం. పాన్ ఇండియా సినిమా అని ఇవాళ అంటున్నాం గానీ ఆయన ఆనాడే పాన్ వరల్డ్ సినిమాలనే తీశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ‘విఠలాచార్య గారి దర్శకత్వంలో నేను ఒకే ఒక్క సినిమా చేశాను. అది ‘ఇద్దరు మొనగాళ్లు’. ఆ సినిమా హిట్ అయ్యింది. నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో ఆయన సినిమాలు చాలా చూశాను. కాంతారావు హీరోగా ఆయన చాలా జానపద సినిమాలు చేశారు. నేను ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేశాను. జానపద నేపథ్యంలో చేసిన సినిమాలు చాలా తక్కువ.
‘ఇద్దరు మొనగాళ్లు’ కాకుండా ‘మహాబలుడు’, ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘సింహాసనం’ సినిమాలు చేశాను. ‘గూఢచారి 116’ విడుదలైన 40 రోజులకు అనుకుంటా… ‘ఇద్దరు మొనగాళ్లు’ ఓకే చేశా. నేను చేసిన ఫస్ట్ మల్టీస్టారర్ కూడా ఇదే. విఠలాచార్య గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే, సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఆయన చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారు. అనుకున్న బడ్జెట్‌లో సినిమాలు తీసేవారు. ఒక దర్బార్ సెట్ వేస్తే.. అందులో ఒకవైపు బెడ్ రూమ్, మరోవైపు కారిడార్ సెట్స్ వేసేవారు. ఆయన ఏ సినిమాకు అయినా ఒకటే సెట్ వేసేవారు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వాహినీ స్టూడియోస్‌కు వచ్చేవారు. నా షూటింగులు ఎక్కువ అక్కడే జరిగేవి. మా సెట్‌కు వచ్చి కూర్చుని, నాతో సరదాగా కబుర్లు చెప్పేవారు.
బీఎన్ రెడ్డిగారు, చక్రపాణిగారు కూడా అలా సెట్స్‌కు వచ్చి కూర్చునేవారు. విఠలాచార్యగారిపై పుస్తకం తీసుకు వస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు. సినిమా నిర్మాణంలో విఠలాచార్య పెద్ద బాల శిక్షలాంటి వారని పుస్తక రచయిత పులగం చిన్నారాయణ అన్నారు. తక్కువ బడ్జెట్, తక్కువ లొకేషన్లు, వేగంగా సినిమా నిర్మాణం విఠలాచార్య ప్రత్యేకత అన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా ఈ పుసక్త రచనకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. రచయితగా తనకిది 9వ పుస్తకమని అన్నారు. ఆయన సినిమాని ఎంత వేగంగా పూర్తి చేస్తారో అంతే వేగంగా ఈ పుస్తక రచనను పూర్తిచేసినట్టు చెప్పారు. ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











