వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండేలా కనిపించే నటి సాయి పల్లవి. తన పనేంటో తాను చేసుకుపోతూ కూల్ గా ఉంటారు ఆమె.అలాంటి సాయి పల్లవి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వివాదాస్పదంగా మారాయి. దీంతో ఒక్కసారిగా సాయి పల్లవి పేరు జాతీయ స్థాయిలో మారు మొగుతోంది.
జమ్మూకశ్మీర్ లో ఊచకోతకు గురైన కశ్మీరీ పండిట్ల గురించి సాయి పల్లవి కొన్ని కామెంట్స్ చేయగా , అవి ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. మతం పేరుతో జరిగే హింసకు తాను వ్యతిరేకమంటూ సాయి పల్లవి మాట్లాడిన మాటలు ఆమెను ఇబ్బందుల్లోకి తోసేశాయి.
‘గతంలో కశ్మీరీ పండిట్లను ఎలా చంపారనే విషయాన్ని ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో చూపించారు. ఈ విషయాన్ని మీరు మతపరమైన సంఘర్షణగా చూస్తున్నట్టయితే… అలాంటిదే ఇటీవల మరొక ఘటన జరిగింది. తన వాహనంలో ఆవులను తీసుకెళ్తున్న ఒక ముస్లిం వ్యక్తిపై దాడి చేశారు. జైశ్రీరాం అని నినదిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. అప్పుడు కశ్మీరీ పండిట్లపై జరిగిన దానికి, ఇప్పుడు ముస్లిం వ్యక్తిపై జరిగిన దానికి తేడా ఏముంది?’ అని ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె ప్రశ్నించారు.
సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు ఆమె వ్యాఖ్యలను స్వాగతిస్తుండగా… చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక జాతిపై జరిగిన మారణహోమానికి, ఆవులను రక్షించేందుకు జరిగిన దాడికి తేడా లేదా? అని ఆమెపై మండిపడుతున్నారు. జాతీయ మీడియా సైతం సాయి పల్లవి వ్యాఖ్యలకు సంబంధించిన కథనాలను ప్రసారం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ఒక కశ్మీరీ హిందూ వ్యక్తి స్పందిస్తూ సాయి పల్లవి వ్యాఖ్యల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముస్లింను కొట్టడానికి, ఒక జాతినే కూకటివేళ్లతో పెకిలించి వేయాలనుకోవడానికి చాలా తేడా ఉందని ఆయన అన్నారు. తమ మనసుల్లో ఉన్న అంతులేని వ్యథను తగ్గించే ప్రయత్నం చేయవద్దని చెప్పారు. ఇక్కడికు వచ్చి ముక్కలైన తమ హృదయాలను, ధ్వంసమైన తమ ఇళ్లను చూడాలన్నారు. ఒక జాతిని నిర్మూలించడానికి చేసిన మారణహోమానికి తాము సాక్షులమని చెప్పారు. న్యాయం కోసం తాము ఎదురు చూస్తున్నామని అన్నారు