ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారని.. ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని చెప్పగలరా? అని ప్రశ్నించారు.
స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారని తెలిపిన లోకేష్.. ఇప్పటికైనా చిత్తశుద్ది ఉంటే ఆ దిశగా చర్యలు ప్రారంభించాలని అన్నారు.”ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడిందే నిజమైతే… ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటన చేయగలరా?” అని లోకేశ్ సవాల్ విసిరారు. మెడలు వంచుతారా? లేక కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి గారూ? అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
ఇప్పటికే లోకేష్ ఛాన్స్ దొరికినప్పుడల్లా జగన్ ప్రభుత్వం పై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని పలు సందర్భాలలో ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ క్రమంలోనే జగన్ మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అంటూ ఆయన జగన్ ను బహిరంగంగానే విమర్శించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల నేపధ్యంలో సిఎం జగన్ కు నారా లోకేష్ ట్విటర్ వేదికగా విసిరిన సవాల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.