యాడ్ కాన్సెప్ట్ తయారుచేసేటప్పుడు కూడా ఒళ్లు దగ్గరుంచుకోవాలని అల్లు అర్జున్ కు ఈరోజు అందిన నోటీసు చూస్తేనే అర్థమవుతుంది. యాడ్ చేయటానికి మంచి రెమ్యూనరేషన్ తీసుకుని అల్లు అర్జున్ లాంటి వారు ఓకే చెప్పేముందు కాన్సెప్ట్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ర్యాపిడో సంస్థ ను ప్రమోట్ చేస్తున్నామని అనుకున్నారుగానీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కించపరుస్తున్నామని మాత్రం యాడ్ మేకర్స్ ఊహించలేకపోయారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే మామూలు దోసెల మాదిరిగా ఎక్కువ సమయం తీసుకుంటాయని, అదే ర్యాపిడో అయితే అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందంటూ’ అల్లు అర్జున్ ఈ యాడ్ ఫిలిం చేశారు. చివరికి ఈ యాడ్ టీఎస్ ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన అల్లు అర్జున్ కు నోటీసు పంపే ఏర్పాటు చేశారు. పుష్ప సినిమా షూటింగులో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కు ఇది షాక్ లాంటి వార్తే. సినిమా నటులు ప్రజా రవాణా సంస్థను ప్రోత్సహించేలా యాడ్స్ చేయాలిగానీ ఇలా కించపర్చేలా చేయరాదంటూ సజ్జనార్ సూచించారు.
ఈ యాడ్ పై ఆర్టీసీ ప్రయాణికులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా తమ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారన్నారు. ఇప్పటికే బస్సులు, బస్టాండ్ లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించేవారిపై చర్యలు తీసుకున్నామని, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల హోదాలో ఉన్న నటీనటులు, సెలబ్రిటీలు ప్రజాప్రయోజనాలకు హానికలిగించే ప్రచారాన్ని చేయరాదని అన్నారు. మరి దీనికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. మొత్తానికి ర్యాపిడో వారి దోసె యాడ్ మాడిపోతుందేమో చూడాలి.











