హైదరాబాద్‌కు వరదలొచ్చాయి.. పోయాయి కూడా. కానీ తెలంగాణలో మాత్రం హైదరాబాద్ కేంద్రంగా వరద చుట్టూ బురద రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. వరదల సాయం అందజేతలో, బాధితులను ఆదుకోవడంలో అధికార, విపక్ష నేతల నడుమ జరుగుతున్న విమర్శలు చూస్తే ఇది నిజమే అనక మానరు. గత కొన్ని రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నీట మునిగింది. బిక్కుబిక్కు మంటూ జనం నీళ్లల్లోనే ఉంటూ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. ఒకవైపు కరోనా మరోవైపు వరదలతో జనం పడరాని ఇబ్బందులు పడ్డారు. దాదాపు 50 మంది వరకు చనిపోయారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన అధికార పార్టీ నేతలను అడుగడుగునా జనం ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలపై నాటి వరద ప్రభావం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి అధికార పార్టీపై నిరసనలు ఎప్పుడూ రాలేదు. పంటకు గిట్టుబాటు ధరలేదనో.. జీతాలు పెంచాలనో, ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనో ఇలాంటి సమస్యలపైనే ఒక వర్గం ప్రజలు మాత్రమే గతంలో నిరసనలు తెలిపిన దాఖలాలున్నాయి. కానీ మొట్టమొదటి సారిగా హైదరాబాద్ ప్రజలు.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ తమ గొంతును లేవనెత్తారు. ఏకంగా కాలర్ పట్టుకుని ప్రజాప్రతినిధులను ప్రశ్నించే వరకు జనం తిరగబడ్డారంటే ఎంతలా ఆవేశం, సమస్యలు, బాధ ఉంటే గానీ అలా చేయరు. వారికి తోడూ ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం గొంతుకలిపారు. ప్రజాగ్రహం ఇంకా పెల్లుబికకముందే అధికార పార్టీ వెంటనే నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. ఏకంగా రూ.550 కోట్ల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కూలిపోయిన ఇళ్లకు రూ.లక్ష, దెబ్బతిన్న ఇళ్లకు దాదాపు రూ.50 వేలు, నీట మునిగిన ఇళ్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించింది. దీనికి తోడూ మున్సిఫల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆరే నేరుగా రంగంలోకి దిగి అధికారులను వెంటబెట్టుకుని వరద ముంపు ప్రాంతాలను రోజుల తరబడి పర్యటించి తాము అండగా ఉంటామని ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కానీ హైదరాబాద్ వరదలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలను, ప్రభుత్వం మీద వ్యతిరేకతను మాత్రం తుడిచి వేయలేకపోయారు.
అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత..
వరదల వల్ల ఇళ్లల్లో వచ్చి చేరిన బురద ప్రస్తుతం పోయిందేమోగానీ ఆ నాటి హైదరాబాద్ వరద తాలూకు చేదు జ్ఞాపకాలు హైదరాబాద్ ప్రజల మనస్సుల్లోంచి పోకుండా అలానే పేరుకుపోయి ఇంకా ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏకబిగిసిన కురిసిన వర్షంతో హైదరాబాద్ రోడ్లన్నీ చెరువుల్లా తలపించాయి. వరద నీటితో చెరువులు నదులను తలపించాయి. కొన్ని చెరువుల కట్టలు తెగి కాలనీలు నీటమునిగాయి. ఫలక్‌నామా ప్రాంతమంతా నీటితో కప్పిపోయింది. రామాంతాపూర్, ఉప్పల్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్ ఇలా అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో ఆ రాత్రి ఉండిపోయాయి. హైదరాబాద్‌కు వరదలు కొత్తేమీ కాదు. గతంలో 2000 సంవత్సరంలో కూడా హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయి. కానీ ఈ స్థాయి వరదలు మాత్రం ఇదే మొదటి సారిగా భావించాల్సి ఉంటుంది. చెరువులు, కుంటలు, నాలాలు, వరద కాలువలు ఆక్రమణకు గురికావడంతోనే వరద నీరు అంతలా హైదరాబాద్‌ను ముంచెత్తింది. ఇదీ అధికారపార్టీకి తెలిసిన విషయమే. కానీ ఆ ఆక్రమణలను తొలగించే సాహసం చేస్తుందా? అంటే ఏమో అనే చెప్పాలి. సుమారు లక్ష నిర్మాణాలను కూల్చితే గానీ హైదరాబాద్ నాలా పరిస్థితి మారదని సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి తలసానే చెప్పడం గమనార్హం. ఈ ఆక్రమణలు ఎవరి హయాంలో జరిగాయో అని అని ప్రజలు ఆలోచన చేస్తారా? చేయరు. ఇప్పుడు అధికారంలో ఉన్న వారు ఏం చేస్తున్నారని మాత్రమే ఆలోచిస్తారు. ప్రజల అవసరాలను తీర్చి, సుపరిపాలనను అందించాలని మాత్రమే ప్రజలు కోరుకుంటారు తప్పితే.. ఈ ఆక్రమణలు మా హాయంలో జరగలేదని అంటే అది తప్పించుకోవడమే అవుతుందని భావిస్తారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి…
ఇదిలా ఉంటే వరద బాధిత కుటుంబాలకు ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయం వివాదాస్పదమవుతూ వస్తోంది. వరద సహాయాన్ని అందజేయడంలో అధికార పార్టీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలకే అవి చేరుతున్నాయనే ఆరోపణలను మొదటి నుంచి చేస్తు వస్తున్నారు. మరోపక్క రూ.150 కోట్ల స్కామ్ జరిగిందంటూ రేవంత్ రెడ్డి ఇటీవలే ఆరోపించారు. చెక్కుల రూపంలో ఇవ్వకుండా నగదును నేరుగా ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని గవర్నర్‌కు కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అలాగే వరద బాధితులను తీసుకుని రేవంత్ రెడ్డి కూకట్‌పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ ఆఫీసులో శనివారం ధర్నాకు దిగారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం వరద బాధితులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ముందు నుంచి గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. వరద అంశమే సెంటర్ పాయింట్‌గా ఈ విషయాలపై ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార పార్టీకి టార్గెట్ చేయడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటూ వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందస్తుగా పోవాలనుకునే ఆలోచనను ఈ వరదల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విరమించుకునే ఆలోచనలో ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తి, ప్రతిపక్ష పార్టీల రాద్ధాంతం నడుమ ఎన్నికలకు పోతే అది మనకే మైనస్ అవుతుందని అధికార పార్టీ నేతలు గులాబీ బాస్‌లకు మొరపెట్టుకుంటున్నారట. కాస్త ఈ వరద గొడవలు సద్దుమనిగాక వెళితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని గులాబీ బాస్ వద్ద వ్యక్తం చేస్తున్నారట.
వివరణ ఇచ్చుకునే ప్రయత్నం…
వరద సాయం అందజేత విషయంలో ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలకు కౌంటరిచ్చారు. నాలుగు లక్షల వరద బాధితులకు నష్ట పరిహారం ఇచ్చిన లెక్కలు, వివరాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. ఎలాంటి భేదాలు లేకుండా సాయం అందించామని, బాధితులను వెంటనే ఆదుకోవాలని రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తుంటే కావాలనే రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ వరదలపై బురద రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. బురద రాజకీయాలు చేస్తూ దుబ్బాకలో ఓట్ల కోసం ప్రయత్నం చేశాయన్నారు. వరదలొచ్చినప్పుడు గుజరాత్, కర్ణాటకకు సాయం అందించారు గానీ తెలంగాణకు ఎందుకు చేయరని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. వరదపై కేంద్రానికి లేఖ రాస్తే ప్రధాని స్పంచలేదని, తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రం దృష్టిలో దేశంలో లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలున్నారని వారు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని తెలిపారు. కిషన్‌రెడ్డి సహాయ మంత్రా? నిస్సాహాయ మంత్రా అని ఎద్దేవా చేశారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సీఎంని మరో రూ.వంద కోట్లు కావాలని అడుగుతామన్నారు. పంట నష్టం సహాయంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మీటింగ్ పెట్టి ప్రతిక్షాలకు కౌంటరిస్తే ఏముంటది. ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాలిగానీ.. అని నగర జనం అనుకుంటున్నారు.











