వచ్చే సంక్రాంతి బరిలో పెద్ద యుద్ధమే జరగబోతోంది. బరికి దిగేది సంక్రాంతి కోళ్లు కాదు సినిమా స్టార్లు. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం ఖాయమని తేలిపోయింది.
జనవరి 7న ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణం, అంతకన్నా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బాహుబలి తర్వాత వచ్చే రాజమౌళి సినిమా ఇది. అలాగే బాహుబలి ప్రభాస్ ను పాన్ ఇండియా హీరోగా మారాక రూపొందిన మరో పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’. ఇది జనవరి 14న విడుదలవుతోంది. ఈ మధ్యలో జనవరి 12న పవర్ స్టార్ సినిమా ‘భీమ్లానాయక్’ ఉంటుందా లేదా అన్న సందేహాలకు తెరపడి పోయింది.
ఒకవిధంగా చెప్పాలంటే ఈ భారీ ఆటలో ఈ సినిమా అరపండు లాంటిదని కొందరు భావిస్తున్నారు. అది ఆటలో అరటి పండా? సంక్రాంతి కోటలో పనస పండా? అన్నది ఫలితం వస్తేనేగానీ తెలియదు. భీమ్లానాయక్ కచ్చితంగా జనవరి 12నే అని ఈరోజు పోస్టర్ కూడా విడుదల చేశారు. పవర్ స్టార్ కు నచ్చ చెప్పి విడుదలను వాయిదా వేయించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పోటీలో ఎందుకులే అనుకుని మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ విడుదలను వాయిదా వేసేశారు. ఇక నాగార్జున ‘బంగార్రాజు’ కూడా బరిలో ఉంది. దాదాపు రూ. 500 కోట్లతో రూపొందిన సినిమాలు ఈ సంక్రాంతి సీజన్ లో విడుదల కాబోతున్నాయి.
సినిమాలకు సీజన్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి మాత్రమే. ఈ సినిమాల మీద దాదాపు 5 వేల కోట్ల రూపాయల బిజినెస్ జరగబోతోంది. ఎందుకంటే బాహుబలి – ది కంక్లూజన్ దాదాపు 2000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ట్రిపుల్ ఆర్ గాని, రాధేశ్యామ్ గాని దాదాపు 4000 కోట్ల వసూళ్లను సాధించడం పెద్ద విశేషమేమీ కాదు. 2020లో మహేష్ బాబు నటించిన సరిలేరు మీకెవ్వరు, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు రెండూ రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఆ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ఈజీగా రూ. 200 కోట్ల వసూళ్లు సాధించడానికి అవకాశం ఉంది. ఇంత వసూళ్లు సాధించాలంటే అది సంక్రాంతి సీజన్ లోనే సాధ్యం.
Must Read ;-సంక్రాంతి కోళ్లు కాదు.. స్టార్లు.. రణమా, శరణమా?
ప్రభుత్వం టార్గెట్ చేసిందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ కచ్చింతంగా టార్గెట్ చేస్తుందన్న ఆందోళన ఓ పక్క ఉంది. ఎందుకంటే ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు తదితర అంశాల విషయంలో ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టిక్కెట్ రేట్ల పెంపుదల విషయంలో ఏపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పవర్ స్టార్ సినిమాను ఇరుకున్న పెట్టాలంటే యథాతథ స్థితిని అమలు చేయాలి. పెద్ద సినిమాలు విడుదలకు లైన్లో ఉన్నందున టిక్కెట్ల రేట్లు పెంచాలన్న ప్రతిపాదనను సినీ పెద్దలు వేగవంతం చేశారు. ఒకవేళ భీమ్లా నాయక్ విడుదల వాయిదా పడితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే పరిస్థితి ఏమిటి అనేది మరో సమస్య.
నిజానికి ఇది ఇండస్ట్రీ సమస్య. దీన్ని వ్యక్తిగత కోణంలో చూడటం వల్లే ఇంత జాప్యం జరుగుతోందన్న విమర్శ ఉంది. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో కాకుండా సినిమా ఇండస్ట్రీ పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలని ఫిలిం ఛాంబర్ కోరుతోంది. పవర్ స్టార్ కు ఏ విధంగా చూసినా జనవరి 12 మాత్రమే సేఫ్ జోన్ అని చెప్పవచ్చు. కాకపోతే పాన్ ఇండియా సినిమాలను ప్రత్యేక కేటగిరీ భావించి ప్రభుత్వం వాటి విషయంలో టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించే అవకాశం లేకపోలేదు.
సినిమాలకు కొత్త సంక్రాంతి
సినిమాల పరంగా చూస్తే వచ్చేది కొత్త సంక్రాంతి అని చెప్పాల్సి ఉంటుంది. తమ సినిమాలు ఎప్పుడో పూర్తయినా వాటిని విడుదల చేయకుండా వచ్చే సంక్రాంతినే టార్గెట్ చేసుకుని అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఇలా విడుదలైతే థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. తక్కువ థియేటర్లలో సినిమా విడుదలైతే ఒకవేళ సినిమా ఫాప్ అయితే భారీ వసూళ్లు సాధించడం కష్టం. అప్పుడు ఎంతో మంది పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతారు. భారీ వసూళ్లు సాధించాలంటే ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలకు రెండు వారాల వ్యవధి కావలసిందే. జనవరి 7కూ జనవరి 12 మధ్య ఐదు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. పవర్ స్టార్ కు ఎంత నచ్చచెప్పినా ఆయన వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఫలితంగా నిర్మాతపై ఒత్తిడి పెరుగుతోంది.
గడువు సమీపించే కొద్దీ టెన్షన్ వాతావరణం నెలకొనక తప్పదు. చివరికి ఈ పంచాయితీ మెగాస్టార్ దగ్గరకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పైగా ట్రిపుల్ ఆర్ లో ఉన్నది పవర్ స్టార్ అన్నయ్య కొడుకే. రాజమౌళికి కూడా సమస్య తప్పడం లేదు. అప్పటికీ బరిలో ఉన్న ఆలియా భట్ సినిమా ‘గంగూభాయి కతియావాడి’నీ పక్కు తప్పించారు. తన సినిమాలతో ఎదిగిన ప్రభాస్ ను తప్పుకోమని అనలేరు, రానాను అడిగినా ప్రయోజనం లేదు. ఓ పక్క ప్రభుత్వపరమైన సమస్య, ఇంకో పక్క సొంత ఇంటి కుంపటి.. పరిష్కారం ఎలా దొరుకుతుందో చూడాలి. మరి వీరి మధ్య సంధి కుదురుతుందో సమరమే చెలరేగుతుందో చూడాలి.
– హేమసుందర్ పామర్తి
https://www.youtube.com/watch?v=rJ4BC1xsC14











