గ్యాస్ సిలిండర్‌లలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు, వినియోగదారులకు పారదర్శకమైన సేవలను అందించేందుకుగానూ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. దీంతో హోమ్ డెలివరీ రూల్స్ మారనున్నాయి. ఈ నిబంధనలను పాటిస్తేనే మీ వంటింటికి గ్యాస్ వచ్చి చేరుతోంది. లేకుంటే గ్యాస్ డెలివరీ కావడం కష్టమే అని అంటున్నారు.
డీఏసీ కోడ్ తప్పనిసరి..
వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ఆయిల్ సంస్థలు డీఏసీ(డెలివరీ అథంటికేషన్ కోడ్) అనే కొత్త డెలివరీ వ్యవస్థను తీసుకొస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఇంతకు ముందులా మన ఇంటికి గ్యాస్ డెలివరీ కాదు. గ్యాస్ డెలివరీ కావాలంటే ఇలా చేయాల్సిందే. ఫస్ట్ మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్న తరువాత మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డీఏసీ నుంచి మెస్సెజ్ వస్తుంది. అందులో కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ను డెలివరీ బాయ్‌కు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సిలిండర్ డెలివరీ అవుతోంది.
యాప్‌లో అప్‌డేట్ అవకాశం..
మీ మొబైల్ నంబర్ గ్యాస్ ఏజెన్సీ వద్ద రిజిస్టర్ చేసుకోకపోతే.. గ్యాస్ డెలివరీ బాయ్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా వినియోదారులు తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత బుక్ చేసుకుంటే నంబర్‌కు డీఏసీ కోడ్ వచ్చేస్తుంది. అయితే మొబైల్ నంబర్ తప్పుగా ఇచ్చినవారు, ఇంటి అడ్రస్ తప్పుగా ఇచ్చిన వారు సిలిండర్ డెలివరీ సమయంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి అప్‌డేట్ చేసుకోవడం మంచిది. అయితే ఈ నిబంధనలు మొదట 100 పట్టణాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆ తరువాత ఇతర పట్టణాలకు విస్తరిస్తారు. వంట గ్యాస్ సిలిండర్లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లకు మాత్రం కాద సంస్థలు పేర్కొంటున్నాయి.











