రాయలసీమలోని కర్నూలు,అనంతపురం జిల్లాల్లో వజ్రాల వేట ప్రారంభమైంది.రెండు రోజుల కిందట ఓ రైతుకు 30క్యారెట్ల వజ్రం దొరకడం,దాన్ని రూ.కోటి 20 లక్షలకు అమ్ముకోవడంతో మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి,అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్,కళ్యాణదుర్గం,రామగిరి,బుక్కరాయసముద్రం ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో వజ్రాల వేట ప్రారంభమైంది.పురాతన కాలం నుంచి అనంతపురం,కర్నూలు జిల్లాల్లో వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి.ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషణ సాగుతుంది.ఈ ఏడాది ఇప్పటికే కొందరికి వజ్రాలు లభించాయని తెలియడంతో రాయలసీమ ప్రాంతం వారే కాకుండా హైదరాబాద్, బెంగుళూరు లాంటి నగరాల నుంచి కూడా కార్లు వేసుకుని వచ్చి మరీ వజ్రాల వేట కొనసాగిస్తున్నారు.
నాణ్యమైన వజ్రాలకు ప్రసిద్ధి
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దశాబ్దాలుగా వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి.ఈ గ్రామ పొలాల్లో దొరికే వజ్రాలు చాలా నాణ్యమైనవి కావడంతో ఎక్కవ మంది ఈ గ్రామ పొలాలకు వజ్రాల వేటకు వస్తూ ఉంటారు.ఈ ఏడాది ఇప్పటికే కొందరికి వజ్రాలు దొరకడంతో వేలాది మంది డైమండ్స్ అన్వేషణకు బయలు దేరారు.చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కార్లలో భోజనాలు,మంచి నీరు తెచ్చుకుని మూడు రోజులపాటు అక్కడే మకాం వేసి వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు.అయితే ఎవరికి వజ్రాలు దొరికాయి అనేది మాత్రం చాలా రహస్యంగా ఉంటుంది.వజ్రాల లభించినా వెల్లడిస్తే సమస్యలు వస్తాయని,వారు రహస్యంగా కర్నూలు,గుత్తిలోని వ్యాపారులకు విక్రయిస్తూ ఉంటారు.అందుకే వజ్రాలు దొరికినా ఎవరూ బయటకు చెప్పరు.
మకాం వేసిన వ్యాపారులు
ఏటా మే,జూన్ మాసాల్లో ముంబయి నుంచి కొందరు వ్యాపారులు కర్నూలు,గుత్తి,అనంతపురం ప్రాంతాల్లో మకాం వేస్తారు.వారికి వజ్రాల అన్వేషించే గ్రామాల్లో ఏజంట్లు ఉంటారు.వజ్రాలు ఎవరికి లభించినా వెంటనే వీరి వద్దకు చేరిపోతారు.నాణ్యత, బరువు పరీక్షించి ధర నిర్ణయిస్తారు.ఇక్కడ కూడా భారీ మోసాలకు పాల్పడుతూ ఉంటారు.వజ్రాల వేటలో దొరికినా,దొరికిన వారికి వీటి ధర నిర్ణయించడం సాధ్యం కాదు.వ్యాపారులు చెప్పిన ధరకు బేరాలు ఆడుకుని ధరలు మాట్లాడుకుంటూ ఉంటారు.మరి కొందరు వాటిని బెంగళూరు,హైదరాబాద్ తరలించి వాటి నాణ్యతను పరీక్షించి, రెండు మూడు చోట్ల వజ్రాలను చూపించి ధరలు నిర్ణయిస్తారు.ఎవరు ఎక్కువ ధర ఆఫర్ చేస్తే వారికే విక్రయిస్తూ ఉంటారు.
వజ్రాల వేట నిషేధం
వజ్రాలు జాతీయ ఖనిజ సంపద కిందకు వస్తాయి.ఎవరు కూడా అనుమతి లేకుండా వజ్రాల అన్వేషణ చేయడానికి వీల్లేదు.అయితే చాలా మంది అనధికారికంగా వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు.అయితే వ్యవసాయం చేసుకునే రైతులు ఎక్కువగా పొలాల్లో తిరుగుతూ ఉంటారు.కాబట్టి వారికే ఎక్కువగా వజ్రాలు లభిస్తుంటాయని తెలుస్తోంది. తుగ్గలి,జొన్నగిరి,వజ్రకరూర్,రామగిరి,బుక్కరాయసముద్రం,కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట నిషేధంపై పోలీసులు మైకుల్లో ప్రచారం చేస్తూనే ఉన్నారు.అయినా వజ్రాల వేట మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.ఎవరి అదృష్టం ఎలా ఉందో తెలియదు కదా? అందుకే వజ్రాల వేటకు రావద్దని పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నా జనం మాత్రం వారి అదృష్టం పరీక్షించుకునేందుకు అన్వేషణ కొనసాగించడం విశేషం.











