ఏపీలో కూటమి సర్కార్ మరో సిట్ నియమించింది. గత వైసీపీ పాలనలో అడ్డగోలుగా సాగిన మద్యం కుంభకోణంపై ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ జరపనుంది. ఈ సిట్‌కు విజయవాడ పోలీస్ కమిషనర్ S.V.రాజశేఖర్‌బాబు నేతృత్వం వహించనున్నారు. టీమ్‌లో ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ప్రకాశం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కొల్లి శ్రీనివాస్, మంగళగిరి సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆర్.శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సీఐలు శివాజీ, సి.హెచ్.నాగశ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఐదేళ్లలో జరిగిన మద్యం కుంభకోణంపై స్పెషల్ టీమ్‌తో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర విజిలెన్స్,ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హోదాలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ నెల ఒకటిన ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే గతేడాది సెప్టెంబర్‌లో సీఐడీ నమోదు చేసిన కేసులో కీలక సమాచారాన్ని రాబట్టిన ప్రభుత్వం..ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిట్‌ను నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ సిట్‌లో తిరుపతి తొక్కిసలాట ఘటనలో ట్రాన్స్‌ఫర్ అయిన ఎస్‌పీ ఎల్. సుబ్బారాయుడిని టీమ్ మెంబర్‌గా నియమించారు… ఇటీవల జగన్.. సుబ్బారాయుడుపై ధ్వజం ఎత్తారు.. తెలంగాణ నుండి డిప్యుటేషన్‌పై ఎస్‌పీ సుబ్బారాయుడిని తిరుపతికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా తీసుకువచ్చారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సప్త సముద్రాల అవతల ఉన్నా… వెంటాడతామని వార్నింగ్ ఇచ్చారు..
రాష్ట్రంలో ప్రతి శాఖ సిట్‌కు సహాయ,సహకారాలు అందించాలని స్పష్టం చేసింది. ఇక సిట్‌కు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చింది ప్రభుత్వం. ప్రత్యేక పోలీస్ స్టేషన్ హోదా కూడా కల్పించింది. కేసు దర్యాప్తు వివరాలు, ఇతరత్రా వెలికి తీసిన అంశాలను సీఐడీ డీజీతోపాటు డీజీపీకి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులో వివరించింది..
మద్యంపై నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన అప్పటి జగన్..అడ్డగోలుగా లిక్కర్ ధరలు పెంచేశారు. అదేమంటే ధరలు పెంచితే ప్రజలు మద్యం తాగరంటూ ఓ తలతిక్క సమాధానం ఇచ్చారు. కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చిన వైసీపీ పెద్దల అవినీతి బాగోతం..తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా గత సెప్టెంబరు చివరి వారంలో కేసు నమోదు చేసిన సీఐడీ..విచారణ వేగవంతం చేసింది. పాపులర్ మద్యం బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి..నాసిరకం జే బ్రాండ్లు తెచ్చి మద్యం దుకాణాలకు సరఫరా చేసినట్లు గుర్తించింది. ఇందుకు ప్రతిఫలంగా ప్రతి కేసుపై కనీసం రూ.150 నుంచి గరిష్టంగా రూ.450 వరకు ప్రభుత్వ పెద్దలకు చేరినట్లు ఆధారాలు సేకరించింది సీఐడీ. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి ఈ మొత్తం నల్లధనాన్ని హవాలా రూపంలో ముఖ్య నేతకు చేర్చిన విధానాన్ని కనిపెట్టింది. ఇందుకోసం ఓ ప్రత్యేక నెట్‌వర్క్‌ను రూపొందించినట్లు తేల్చింది.
అధికారంలోకి వచ్చిందే తడవుగా మద్యం దోపిడీపై ఫోకస్ పెట్టింది జగన్ టీమ్. మొదట మద్యం డిస్టిలరీస్‌ను బలవంతంగా చేజిక్కించుకుంది. ఏపీలోనే పెద్దదైన నంద్యాల SPY ఆగ్రో ఇండస్ట్రీస్‌తోపాటు దాదాపు అన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఆయా డిస్టిలరీల్లో నాసిరకమైన జె బ్రాండ్లు ఉత్పత్తి చేయించింది. కమీషన్లు ఇచ్చిన వారికి మాత్రమే రూ.వేల కోట్ల మద్యం ఆర్డర్లు ఇప్పించింది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ వద్ద 235 కంపెనీలు మద్యం సరఫరాకు నమోదై ఉండగా..వాటిలో ఏడింటికి మాత్రమే రూ.9,221 కోట్ల ఆర్డర్లు ఇప్పించారు. NSJ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్‌కు రూ.2,876 కోట్లు..SPY ఆగ్రోస్ ఇండస్ట్రీస్-1,569 కోట్లు.. తిలక్‌నగర్ ఇండస్ట్రీస్-1,472 కోట్లు.. సెంటినీ బయో ప్రొడక్ట్స్-1,132 కోట్లు.. ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్-983 కోట్లు.. ఆదాన్ డిస్టిలరీస్-739 కోట్లు.. లీలా
డిస్టిలరీస్‌కు రూ.450 కోట్ల మేర ఇచ్చిన ఆర్డర్ల వెనుక భారీ అవినీతిని గుర్తించింది సీఐడీ.
ఈ వ్యవహారమంతా నడిపించేందుకు పక్కా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు జె.గ్యాంగ్ సభ్యులు. మొత్తంగా లిక్కర్ స్కాంలో రూ.3 వేల 113 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఇప్పటికే గుర్తించారు. తెరవెనుక సూత్రధారి రాజ్ కసిరెడ్డి నుంచి నేరు గా ప్రమేయమున్న మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి వరకూ అందరికీ నోటీసులు పంపే అవకాశాలున్నాయి. విదేశీ సిమ్‌లు వాడి ప్రకాశ్ కాలింగ్ పేరుతో వసూలు చేసిన వ్యక్తుల నుంచి నగదు తీసుకెళ్లిన వ్యక్తులను కూడా బయటకు లాగబోతున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సొంత బ్రాండ్లతో పాటు ఇచ్చిన భారీ ఆర్డర్ల వెనుకున్న రహస్యాలను సిట్ చేధించనుంది.