రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు ఉండడు అని చాలామంది రాజకీయ నాయకులే చెబుతుంటారు. అయితే.. కొన్ని పార్టీలు మాత్రం శాశ్వత శత్రువే కాదు.. తత్కాలిక శత్రువు కూడా ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తుంటాయి. అందులో ఒకటి చత్రపతి శివాజీ లక్ష్య సాధనే సిద్ధంతంగా చెప్పే శివసేన పార్టీ. మహారాష్ట్రలో బలమైన పార్టీగా ఉన్న శివసేన..ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. తమకు ఎవరు ఇబ్బందికరంగా మారతారని భావించినా వాళ్లని టార్గెట్ చేయడం సహజంగానే జరుగుతుంది. అది ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే.. ధారావిలో నివసించే పేదల వరకు…మినహాయింపు ఉండదు. ఇక వారి పనిని సమర్థించేందుకు ఆ పార్టీ పత్రిక సామ్నా ఉండనే ఉంది. ఇదంతా ఎందుకంటే.. తాజాగా బాలీవుడ్, కోలివుడ్, టాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. సోనూసూద్ ముంబైలోని శక్తినగర్‌లో ఆయన తన 6 అంతస్తుల నివాస భవానాన్ని కొన్నాళ్ల క్రితం హోటల్ గా మార్చారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేవని, తాము నోటీసులు ఇచ్చినా సోనూసూద్ స్పందించలేదని బీఎంసీ అధికారులు జూహూ ఏరియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సోనూసూద్, ఆయన భార్య సొనాలీ సూద్ పైనా కేసు నమోదైంది.
ఒక్క అనుమతే రావాల్సి ఉంది
అయితే దీనిపై సోనూసూద్ స్పందించారు. తమకు మిగతా అనుమతులు ఉన్నాయని, మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎంసీజెడ్ఎంఏ) నుంచి ఛేంజ్ ఆఫ్ యూజర్ అనుమతి మాత్రమే రావాలని తెలిపారు. అందుకోసం చాలారోజుల క్రితమే దరఖాస్తు చేశామని, కొవిడ్ కారణంగా కార్యాలయాలు పనిచేయక పోవడంతో అనుమతి రాలేదన్నారు. మరోవైపు శివసేన పార్టీ.. సోనూసూద్‌ను టార్గెట్ చేసిందన్న విమర్శలు మొదలయ్యాయి. ఇందుకు ఓ సారి గతాన్ని పరిశీలిస్తే..
సేవా కార్యక్రమాలతో మరింత క్రేజ్
సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూసూద్ లాక్ డౌన్ టైంలో అందరికీ కావాల్సిన వ్యక్తి అయ్యారు. సేవా కార్యక్రమాల కోసం రూ.10 కోట్లకు తన ఆస్తులను తాకట్టుపెట్టి..పేదలకు అండగా నిలిచారు. విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను రప్పించేందుకు విమానాలను బుక్ చేయడం, దేశీయ రవాణ సౌకర్యం కోసం వందల సంఖ్యలో బస్సులు బుక్ చేయడంతో పాటు ఏపీలోనూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఓ రైతుకు ట్రాక్టర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇక ముంబైలో పలువురు పేదలకు అండగా నిలుస్తున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో సానూసూద్కి పేరు వచ్చింది. అయితే మహారాష్ట్ర లో అధికారంలో ఉన్న శివసేన మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది.
अगर तुम साथ हो ।#pagalnahihona pic.twitter.com/gmscZQR374
— sonu sood (@SonuSood) January 8, 2021
శివసేన అక్కసు..
సోనూసూద్ కార్యక్రమాల వెనుక మోదీనో లేక వేరే శక్తి ఉండి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూ సూద్ త్వరలోనే ప్రధాని మోదీని కలిసి… ‘సెలెబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై’ గా అయిపోతారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొవిడ్ సమయంలో అకస్మాతుగా నయా మహాత్ముడు అవతరించారని, గవర్నర్ కోశ్యారీ ఇప్పటికే ఆయను మహాత్మా సూద్ గా పిలిచారని.. వ్యంగంగా వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్‌కి అన్ని వందల బస్సులు ఎలా వచ్చాయని ఎవరైనా ప్రశ్నించారా అని వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాలు కొవిడ్ టైంలో వలస కార్మికులను తమ రాష్ట్రాల్లోకి అనుమతించ లేదని, సోనూసూద్ పంపించిన వారంతా ఎక్కడికి వెళ్లారని, సోనూ సూద్ మంచి నటుడని, ఆయన చేసిన మంచి పని వెనుక ఎవరో రాజకీయ దర్శకుడు ఉండే ఉంటాడు’ అని రౌత్ ఆరోపించారు. గతంలో ఓ స్టింగ్ ఆపరేషన్‌లో ఆయనకు ఎవరు లబ్ధి చేకూర్చితే..వారిని, వారి ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారని విమర్శించారు.
కంగన తరువాత..సోనూ సూద్
మహారాష్ట్రలో వలస కార్మికుల ఇబ్బందులపై జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో శివసేన ఈ మేరకు ఆయన స్పందించారని భావించారు. తాజాగా సోనూసూద్ పై కేసు నమోదు చేయడంతో శివసేన ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటికి మొన్న.. బీజేపీతో సత్సంబంధాలున్న..కంగన రనౌత్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించింది. ముంబైని పీఓకే అని పిలిచారన్న కారణాన్ని చూపుతూ శివసేన ఆమె ఇంటి కూల్చివేతకు సైతం సిద్ధమైంది. చివరికి కంగనా రనౌత్, శివసేన ఎంపీ, సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ మధ్య వ్యక్తిగత వివాదంగా మారింది. ఇక తాజాగా..సోనూ సూద్‌ను టార్గెట్ చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.











