ఒకప్పుడు రాజకీయాల్లో జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్ లాంటి స్వాతంత్ర్య పోరాట యోధులు ఉండేవారు. అందుకే అప్పటి ప్రజలకు రాజకీయ నాయకుల పట్ల గౌరవం, విశ్వాసం ఉండేవి. ఆ తర్వాత కాలంలో.. ఇందిర, వాజ్పేయి, అడ్వానీ, ఎన్టీఆర్ లాంటి శక్తిమంతమైన నేతలు వచ్చారు. వీరు తమ వాక్చాతుర్యం, నిజాయితీ, దీక్షా దక్షతలతో జనాన్ని సమ్మోహితులను చేసి.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు. రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు. జనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. యువతలో రాజకీయాల పట్ల ఆసక్తి పెంచారు. ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు.
మరి ఇప్పుడేదీ ఆ జవాబుదారీ తనం! బూతద్దం వేసుకుని వెతికినా.. మచ్చుకి కాస్తయినా కనిపిస్తోందా? అంటే.. లేదనే చెప్పాలి. నాటి నాయకుల ప్రసంగాలు టీవీల్లో వస్తుంటే.. పిల్లల్ని పిలిచి మరీ చూపే వాళ్లు నాటి పెద్దవాళ్లు. వారి మాటల ప్రభావం పిల్లల మీద పడుతుందన్న ఆశతో. మరి నేడో..! పిల్లల చెవుల్లో దూదులు పెడుతున్నారు. ఎందుకంటే.. ఎక్కడ ఆ మాటలు వీళ్లు నేర్చుకుంటారోనన్న భయం. ఆ స్థాయికి దిగజారిపోయాయి నేటి రాజకీయాలు. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. అధికార పార్టీ రాజకీయాలు. ఇంకా లోతుగా వివరించాలంటే.. మన మంత్రివర్యుల మాటలు. అందులోనూ ఓ ఐదారుగురి మాటలైతే మరీ చవకబారుగా ఉంటున్నాయి. వారిలో అగ్రగణ్యులు.. మన పౌర సరఫరాల మంత్రి కొడాలి నానిగారు. ఈయన నోరు తెరిస్తే.. పిల్లలు చెవులు మూసుకోవాల్సిందే!
ఎవరైతే నాకేంటి!
కొడాలి నాని.. ప్రత్యర్థులపై బూతులతో దాడి చేయడంలో సిద్ధహస్తుడు. అందుకే.. ఈయన్ను మన జగనోరు ఏరి కోరి మరీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తన యజమానిని ఎవరు ఏమన్నా.. ఈయన ఊరుకోరు. వారిపై నిర్దక్షిణ్యంగా బూతులతో దాడి చేస్తారు. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. ఆ దాడి అలా ఇలా ఉండదు.. ‘హవ్వా! ఒక మంత్రి ఇలా కూడా మాట్లడతారా!’ అని అనిపించేలా ఉంటుంది. అవతల ఉన్నది చంద్రబాబైనా.. ఉమా మహేశ్వరరావైనా ఒకటే ఈయనకు. వారి వ్యక్తిత్వాన్ని దిగజార్చడం, తన యజమానిని సంతృప్తి పరచడం.. అదే ఈయన లక్ష్యం. పవిత్రమైన అసెంబ్లీలోనైనా నిస్సిగ్గుగా బజారు భాష మాట్లాడడం ఈయన నైజం. ఆ బజారు భాషను చిద్విలాసంగా వింటూ ఆనందిస్తుంటారు మన జగనోరు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి.. ఎలా ఉండకూడదో చూపిస్తున్నారు మన నానిగారు. అయినా.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా ఏంటి?
Must Read ;-ఐ డోంట్ కేర్.. మూడు ఛానళ్లపై విరుచుకుపడ్డ మంత్రి నాని
పేకాడితే ఉరి తీస్తారా ఏంటి?
మన ‘అ’గౌరవనీయ మంత్రివర్యులు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘పేకాడితే తప్పా! దానికేమీ ఉరి శిక్ష వేసేయరు కదా! జస్ట్ ఫైన్ వేసి వదిలేస్తారు’ అని సెలవిచ్చారు. ఓ సాధారణ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు గానీ.. ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి చాలా బరితెగింపు ఉండాలి. ఈయనగారి మాటల్ని ఆదర్శంగా తీసుకుని యువత పేకాట బాట పడితే.. పరిస్థితి ఏంటి? చట్టవిరుద్ధమైన ఒక పనిని తప్పు కాదని సెలవివ్వడం మన నానికే చెల్లింది. పైగా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాశారని మీడియాపై కూడా తన బూతు దాడిని కొనసాగించారు. పత్రికలు, చానెళ్ల పేర్లు, వాటి యజమానుల పేర్లు కూడా పెట్టి మరీ బూతులు తిట్టారు.
నాని గారి పేకాట క్లబ్బులు
కృష్ణా జిల్లాలో మన మంత్రివర్యులు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ ఎంతో కాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ.. ఇటీవల పోలీసు దాడుల్లో 30 మంది నానిగారి మనుషులు అరెస్టయ్యారు. లక్షల కొద్దీ డబ్బు, పదుల సంఖ్యలో కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, ఇక్కడ అరెస్టయింది కేవలం ఆ కార్ల డ్రైవర్లని, పెద్ద తలకాయలను మన నానిగారే తప్పించేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ మంత్రిగా ఉండి.. నిస్సిగ్గుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తూ.. యువతకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో మన బూతు వర్యలు.
సరే.. ఆయన చెప్పిందే నిజమనుకందాం..! ఆయనకు ఈ పేకాట శిబిరాలకు ఎలాంటి సంబంధం లేదనుకుందాం! ఆయన అనుచరులు.. అక్కడ జరుగుతున్న పేకాటను దూరం నుంచే చూస్తూ ఉన్నారనుకుందా! మరి వారు అరెస్టయ్యారుగా.. ఆయన మీద తీవ్రమైన ఆరోపణలే వచ్చాయిగా..! నిజంగా ఆయన అమాయకుడే అయితే.. తన సచ్ఛీలతను నిరూపించుకునే వరకు మంత్రి పదవిని వదులుకోవచ్చుగా! అయినా..అలా చేస్తే.. ఆయన నాని ఎందుకవుతారు? అలా చేయాలంటే.. ఆత్మాభిమానం, నీతి, నిజాయితీ ఉండాలి. వాటికి అర్థం కూడా తెలియదు మన నాని గారికి. అందుకే.. ఎప్పటిలాగానే తనకు బాగా తెలిసిన తన బూతు కత్తిని ప్రత్యర్థులపైకి ఎక్కుపెట్టారు. తన మాటలు విని జనం నవ్వుకుంటారేమోనన్న ఆలోచన కూడా రాదు నాని గారికి. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అని అనుకుంటూ దులిపేసుకుని తిరిగేస్తుంటారు.
Also Read ;- పవనే కరెక్టా? పేకాట బురదలోంచి నాని బయటపడేనా!