ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైందంటే టిక్కెట్ల కోసం అన్ని పార్టీల ఆశావాహులు ఎదురు చూస్తుంటారు. తమ ప్రయత్నాలు తాము చేసుకున్న నాయకులు ఫైనల్ లిస్ట్‌లో తమ పేరు ఉందా లేదా అన్న టెన్షన్‌లో ఉండిపోతారు. నామినేషన్ల చివరి రోజు వరకు ఈ టెన్షన్ తప్పదు. పొత్తులు , సర్దుబాట్లు అన్ని పూర్తి చేస్తుకున్న తరువాతే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుంటాయి. ఆశావాహుల బలాబలాలు , స్థానికంగా ఆ నేతలకు ఉన్న పట్టు , ప్రజల్లో ఆదరణ ఇలా అనేక అంశాలు పరిశీలించిన తరువాతే పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తాయి.
గడువు తక్కువగా ఉండటంతో..
ప్రతి ఎన్నికలకు నామినేషన్లు, విత్ డ్రాయల్స్‌కు కాస్త గడువు ఇస్తుంది ఎన్నికల కమిషన్. అయితే ఈ సారి ఇందుకు పెద్దగా గడువు ఇవ్వలేదు. కేవలం ఐదు రోజుల్లో నామినేషన్లు, స్క్రూటిని ప్రక్రియను పూర్తి చేయాలంటూ సూచించింది. దీంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక కోసం ఉరుకులు పరుగులు పెట్టాయి. ఆశావాహులు సైతం టికెట్ దక్కించుకునేందుకు అవస్థలు పడ్డారు. ఎలాగొలా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని బీ ఫాం సంపాదించుకునే పనిలో పడ్డారు. గడువు తక్కువగా ఉండటంతో గెలుపు గుర్రాల వేట కాస్త ఇబ్బందికరంగానే సాగిందంటూ పలు పార్టీల నేతలు చెబుతున్నారు. చివరకు తమ గెలుపు అవకశాలను మెరుగు పరుచుకునేలా .. వివాదాలకు దూరంగా .. పెద్దగా ఆందోళనలు లేకుండా నాలుగైదు విడతల్లో అభ్యర్థుల లిస్ట్‌లు విడుదల చేశాయి పార్టీలు.
పూర్తిగా రాని అభ్యర్థుల లిస్ట్‌లు
గతానికి భిన్నంగా ఈ సారి నామినేషన్ల గడువు ముగిసినా కొన్ని పార్టీలు తుది జాబితా విడుదల చేయలేక పోయాయి. మూడు రోజుల సమయం ఉన్నా పూర్తి స్థాయి జాబితా విడుదల చేయడంతో విఫలం అయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ చివరి రోజు ఉదయం తుది జాబితా విడుదల చేయగా .. రెండు జాతీయ పార్టీలు ఇంకా పూర్తిగా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటి వరకు 116 మంది జాబితానే ప్రకటించింది. మిగతా 34 మంది అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తులు సాగుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బీజేపీ కూడా ఇదే తరహాలో తమ జాబితాపై కసరత్తులు చేస్తూనే ఉంది. బీజేపీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో ఆ పార్టీలో పోటీ చేసేందుకు భారీగా డిమాండ్ వస్తోంది. ఆశావాహులు తమకే టికెట్ కేటాయించాలంటూ తమ తమ స్థాయిల్లో ఒత్తిడి తెస్తుండటంతో లిస్ట్ ఫైనల్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది . ఇప్పటి వరకు బీజేపీ 128 మంది అభ్యర్థుల లిస్ట్ మాత్రమే ప్రకటించింది. మరో 22 డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉండటంతో పెండింగ్‌లో పడింది. పార్టీల కసరత్తులు ఎప్పటికి పూర్తవుతాయో.. ఎప్పుడు ప్రచారం చేసుకోవాలో అన్న సందిగ్ధంలో అభ్యర్థులు ఉన్నారు.











