టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏ వ్యూహం అనుసరిస్తుందో ఎవరికీ అంతు పట్టదు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యర్థులను బోల్తా కొట్టించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ, గ్రేటర్ ఎన్నికల్లో అయినా ఒకే తరహా వ్యూహం అనుసరించారు. ఎవరూ ఊహించని విధంగా అంతా తేరుకునే లోపే కేసీఆర్ గతంలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు కూడా గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ అలాగే విడుదుల చేసి ప్రత్యర్థులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. చాపకింద నీరులా తన పని తాను చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇతరులకు తేరుకునేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇప్పించింది. దీంతో ఇతర పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. నామినేషన్లకు తుది గడువు రేపే కావటంతో ప్రతిపక్ష పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
కప్పదాట్లకు అవకాశం లేకుండా..
ఎన్నికలంటేనే కప్పదాట్లకు పెట్టింది పేరు. ఐదేళ్ళుగా ఓ పార్టీలో పనిచేసి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వక పోతే పక్కపార్టీల వైపు చూడటం మన రాజకీయ నేతలకు అలవాటే. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుండి నామినేషన్ ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తమకు అందలం ఇచ్చే పార్టీలో చేరిపోతూ ఒక్కసారిగా రంగులు మారుస్తుంటారు. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో ఆ అవకాశం లేకుండా .. సమయం కూడా ఇవ్వకుండా నోటిపికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం . దీంతో రాజకీయ నాయకులకు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. టికెట్ రాని నాయకులు ఇతర పార్టీలతో సంప్రదింపులు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో అర్థంకాక కొందరు బావురు మంటున్నారు.
Must Read ;- అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి జంపవుతున్న లీడర్లు!
105 మంది జాబితా విడుదల చేసి షాకిచ్చిన కేసీఆర్..
గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కువగా సిట్టింగులవైపే మొగ్గు చూపారు. సిట్టింగ్ కార్పోరేటర్లను మారిస్తే పార్టీలో గందర గోళం ఏర్పడుతుందని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే స్ట్రాటజీ అమలు చేశారు కేసీఆర్. ముందస్తుకు వెళ్తూ కొత్తవారికి టికెట్‌లు ఇస్తారని భావించినప్పటికి సిట్టింగులకే టికెట్ కేటాయించి బంపర్ మెజారిటీతో రెండోసారి ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సిట్టింగులకు టికెట్ ఇవ్వడం ద్వారా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ పదునైన విమర్శలు చేసిన కేసీఆర్ గ్రాండ్‌గా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీంతో ఇతర పార్టీల కంటే ముందే టీఆర్ఎస్ దాదాపు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి గందర గోళం లేకుండా ప్రచారంలోకి వెళ్తున్న టీఆర్ఎస్‌కు సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Also Read ;- ‘పబ్లిక్ టాయిలెట్లను కేసీఆర్, కేటీఆర్ వాడుతున్నారు’