దుబ్బాక ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై మూడవ స్థానానికే పరిమితమైంది. అక్కడ పోగొట్టుకున్న పరువును జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా గెలిచి నిలబెట్టుకుందామని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమైన నేతులు కొందరు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లోకి జంపవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ మేయర్‌గా పనిచేసిన బండా కార్తీక ఈమధ్యనే బీజేపీలో చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, శేరిలింగంపల్లి ఇంఛార్జీ రవికుమార్ తో పాటు మరికొంత మంది నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సిటీ ఇంఛార్జీ అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అలిగారు. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో సంప్రదించకుండానే ఎలా ఖరారు చేస్తారని అంజన్ కుమార్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నిన్న, మొన్న పార్టీ ఏర్పాటు చేసిన సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇలా పార్టీలోని ముఖ్య నేతలు ఎడమొఖం పెడమొఖం పెట్టుకుని ఉండడం అది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతోందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల్లో స్పీడ్ పెంచేశాయి. అభ్యర్థుల ఎంపికను ఈ రోజు ఫైనల్ చేయనున్నారు. అలాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలను తమ పార్టీలోకి లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలపై అలిగిన ఆ పార్టీ నగర ఇంఛార్జీ అంజన్‌కుమార్ యాదవ్ కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Must Read ;- మేల్కొనకపోతే కాంగ్రెస్ కనుమరుగే..!