రెండు తెలుగు రాష్ట్రాల కమల దళపతులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒకేసారి హస్తినకు పిలిపించడంపై అనేక రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు పెంచారు. దబ్బాక ఉప ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేశారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఊహించిన దానికంటే మంచి ఫలితాలు సాధించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల సలహాలతోపాటు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తెరాసపై ఎప్పటికప్పుడు సర్జికల్ స్ట్రయిక్స్ చేయడంతో గ్రేటర్ లో మంచి ఫలితాలు రాబట్టారు.
తెలంగాణలో బీజేపీ నేతలు ఇదే దూకుడు కొనసాగించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. గేట్లు ఎత్తితే తెరాసలో ఒక్కరు కూడా మిగలరని బండి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సమయంలో తెలంగాణలో బీజేపీ అధినేతను ఢిల్లీకి పిలిపించడంపై అనేక రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి. అనేక మంది బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. అయితే ఎవరిని తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే అంశాలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వ్యూహాలను ఇప్పటి నుంచే అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బండిని ఢిల్లికి పిలిపించినట్టు తెలుస్తోంది.
ఇక తెలంగాణాలో త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. గ్రేటర్ లో మేయర్ ఎన్నికపై కూడా బీజేపీ పెద్దలు బండికి గైడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలిచితీరాలనే పట్టుదలతో కేంద్ర పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ విధంగా బండిని ముందుకు కదలిస్తున్నారనే రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి.
సోముకు తలంటుతారా?
ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా బీజేపీ సారధి సోము వీర్రాజు మాత్రం నోరుమెదపకపోవడంపై వీహెచ్ పీ నేతలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. సోముకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించి తప్పుచేశామా అనే ధోరణిలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. కాపులను బీజేపీలోకి తీసుకువస్తాడని సోముకు పగ్గాలు అప్పగిస్తే, ఏపీలో బీజేపీని మరింత బలహీనపరిచే విధంగా సోము చర్యలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. సోము వీర్రాజు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో దేవాలయాలపై దాడులు మరింత పెరిగాయి. అయినా సోము ఈ విషయంలో అంటీముట్టనట్టు వ్యవరించారని హిందూ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి.
తాజాగా రామతీర్థంలో సాక్షాత్తూ రాములోరి విగ్రహం తలను ఖండించినా, సోము వీర్రాజు కనీసం స్పందించిన దాఖలాలు లేవు. దీనిపై సోముకు ఢిల్లీ పెద్దలు తలంటుతారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయని ఊహాగానాలు సాగుతున్నాయి. ఓ వైపు తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తుంటే, ఏపీ బీజేపీ నేతలు వైసీపీకి అమ్ముడుపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే బీజేపీ నేతలు మొద్దునిద్ర నటించడం పార్టీకి తీరని నష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై ఢిల్లీ పెద్దలకు సమాచారం అందిచారు. తీరు మార్చుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సోముకు తలంటే అవకాశాలు లేకపోలేదనే విశ్లేషణలు సాగుతున్నాయి.
తిరుపతి, స్థానిక సంస్థల ఎన్నికలే అజెండా
ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలతోపాటు, తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై కూడా సోము వీర్రాజు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించడంపై జనసేనాని ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. జనసేనను కలుపుకుని వెళ్లాలని సోముకు ఢిల్లీ పెద్దలు చెప్పినా ఆయన ఆ పని చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఏపీ బీజేపీ నేతల తీరుతో వారిని దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది.
జనసేన వల్ల బీజేపీ లబ్దిపొందే అవకాశాలు ఉన్నాయి, కానీ ఏపీ బీజేపీ నేతల వల్ల జనసేనకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరే అవకాశాలు లేవని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో కలసి ఒక్క అడుగు వేసేందుకు కూడా జనసైనికులు ఇష్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో సోము ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
ఏపీ బీజేపీ నేతలు ఎవరికివారే
సోము వీర్రాజు బీజేపీ పగ్గాలు చేపట్టాక ఏపీ నేతలు ఎవరికి వారే అన్న చందంగా తయారయ్యారు. కన్నా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన రోజుల్లో కనీసం ఏపీ బీజేపీ నేతలు డయాస్ పంచుకునే వారు. నేడు ఆ పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. సోము వీర్రాజు వైసీపీకి అమ్ముడు పోయారనే ప్రచారం ఊపందుకోవడంతో అతనితో కలసి ముందుకు సాగేందుకు ఏపీలోని బీజేపీ సీనియర్ నేతలు ఇష్టపడుతున్నట్టు కనిపించడం లేదు. ఏపీలో పెద్ద ఎత్తున దేవాలయాల ధ్వంసం జరుగుతుంటే సోము వీర్రాజుకు కనీసం చీమకుట్టినట్టయినా లేకుండా పోయిందని బీజేపీలోని ఓ వర్గం గుర్రుగా ఉందని తెలుస్తోంది. అందుకే సోముపై ఢిల్లీ పెద్దలకు అనేక ఫిర్యాదులు చేశారు. సోము పార్టీ అధ్యక్షుడిగా ఉంటే కనీసం ఏపీ బీజేపీ నాయకులు వార్డు మెంబరుగా కూడా గెలవలేరని సొంత పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాల తరవాత సోమును బీజేపీ అధ్యక్ష పీఠం నుంచి తప్పిస్తారే ఊహాగానాలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.