వాలంటీర్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏటా రూ.3700 కోట్లు దోచిపెడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఐదేళ్లలో వాలంటీర్ల పేరుతో రూ.17000 కోట్లు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆయన తిరుపతిలో విమర్శించారు. ప్రభుత్వ ఖర్చుతో వాలంటీర్లను ఎన్నికలకు వాడుకుంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. 50 కుటుంబాలకు ఒక వాలంటీరును పెట్టి ఓటు వేయకపోతే రేషన్ కార్డు తీసివేస్తామని, ఫించన్ కట్ చేస్తామని, ఇచ్చిన ఇండ్ల స్థలం గుంజుకుంటామని బెదిరిస్తున్నారని సోము ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి ఉపఎన్నికలో పాల్గొనే అభ్యర్థిని కావాలనే వ్యూహాత్మకంగా ప్రకటించలేదని ఆయన వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిచిపించేందుకు జనసేనతో కలసి రెండంచెల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వీర్రాజు ప్రకటించారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఆదినారాయణ రెడ్డిని నియమించినట్లు సోము వీర్రాజు ప్రకటించారు. పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ప్రచార కమిటీ ఇంఛార్జిలను నియమించారు. బీజేపీ ప్రచార కమిటీని ప్రకటించిన సోము వీర్రాజు, త్వరలో జనసేన అధినేతతో చర్చించి ఆ పార్టీ నుంచి కూడా ప్రచార కమిటీ ఇంఛార్జిలను ప్రకటిస్తామని సోము తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధితో శ్రీకాళహస్తికి సైకం జయచంద్రారెడ్డి, సత్యవేడుకు చిన్న రామకోటయ్య, సూళ్లూరుపేటకు వాకాటి నారాయణ రెడ్డి, వెంకటగిరికి సూర్యనారాయణ, గూడూరుకు పసుపులేని సుధాకర్, సర్వేపల్లికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రచార కమిటీ బాధ్యులుగా నియమించారు.