(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరంలోని ఒక డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని కిడ్నాప్ వ్యవహారం కట్టుకథగా జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు. విజయనగరం జిల్లా గుర్లలో రోడ్డు ప్రక్కనే ఉన్న తుప్పల్లో ఒక అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ళు, చేతులను కట్టేసి ఉన్నట్లుగా మార్చి 1వ తేదీ ఉదయం గుర్ల పోలీసులకు సమాచారం వచ్చింది.
గుర్ల ఎస్ఐ నీలావతి, ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్ళి కాళ్ళు, చేతులు బంధించి ఉన్న సుమారు 24 సంవత్సరాల అమ్మాయిని అపస్మారక స్థితిలో గుర్తించారు. వెంటనే, ఆమెకు స్థానికుల సహకారంతో గుర్ల పోలీసులు సపర్యలు చేసి, చికిత్స నిమిత్తం గుర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, అక్కడి నుండి విజయనగరం ఘోషాసుపత్రికి పంపించారు. చికిత్స తరువాత కోలుకున్న అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్ల పోలీసులు క్రైం నంబరు 45/2021 గా కేసు నమోదు చేశారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన విజయనగరం జిల్లా ఎస్పీ బి.. రాజకుమారి ఈ కేసు దర్యాప్తును దిశ మహిళా పోలీసు స్టేషనుకు అప్పగించి .. డిఎస్పీ టి.త్రినాధ్‌ను దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు.
Must Read ;- అత్యాచారం కట్టు కథేనా..?.. అసలు విషయం రాబట్టిన పోలీసులు
48 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు
మహిళా పిఎస్ డిఎస్పీ త్రినాథ్‌తో పాటు విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్, విజయనగరం రూరల్ సిఐ మంగవేణి, గుర్ల ఎస్ఐ నీలావతి, పి.నారాయణరావు వివిధ బృందాలుగా ఏర్పడి జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో ఫిర్యాది చెప్పిన వివరాల ప్రకారం సాక్ష్యాధారాలను సేకరించారు. చివరికి ఫిర్యాది తనకు తెలిసిన స్నేహితుడిని కలిసేందుకుగాను ఫిబ్రవరి 27న హాస్టల్ నుండి బాబాయ్ దగ్గరకు వెళతానని పర్మిషను తీసుకొని బయటకు వెళ్ళినట్లుగా చెప్పారు. ఇదే సమయంలో హాస్టల్‌లో తన గురించి తన అన్నయ్య వాకబు చేసినట్లుగా విషయం తెలుసుకున్న అమ్మాయి, తన స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన పాలకొల్లు- పాలకొండ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తరువాత బస్సు దిగిన ఆమె గుర్ల రోడ్డు ప్రక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించేందుకుగాను తనకు తానే కాళ్ళు, చేతులను చున్నీతో కట్టుకొని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించినట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులకు తెలిపారు.
తాను హాస్టల్ నుండి బయటకు వెళ్ళిన విషయంలో కుటుంబ సభ్యులను, స్నేహితులను నమ్మించేందుకే తనను గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ళు, చేతులు కట్టేసినట్లు కట్టు కథ చెప్పినట్లుగా వెల్లడైందని, ఈ విషయం సిసీ ఫుటేజిల పరిశీలన ద్వారా నిర్ధారణ అయ్యిందని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు. ఈ కేసు విచారణలో సమర్ధవంతంగా పనిచేసి, 48 గంటల్లో కేసును ఛేదించి, వాస్తవాలను వెలికితీసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రాజకుమారి అభినందించారు.
Also Read ;- కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం..!











