పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ ఒక చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మొఘల్ చక్రవర్తుల కాలానికి చెందిన ఒక బందిపోటుగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. ప్రస్తుతం ఆమె కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం సాయిపల్లవిని అడగ్గా, ఆమె సున్నితంగా తిరస్కరించిందట. దాంతో ఆ పాత్ర కోసం జాక్విలిన్ ఫెర్నాండేజ్ ను తీసుకున్నారు.
సాయిపల్లవికి ఈ పాత్ర నచ్చకపోవడం వల్లనే ‘నో’ చెప్పిందని కొందరు అంటుంటే, బల్క్ డేట్స్ ఇవ్వడం కుదరక పోవడం వలన చేయనందని మరికొందరు చెబుతున్నారు. బల్క్ డేట్స్ అవసరమనే ఈ సినిమా టీమ్ జాక్విలిన్ కి కూడా చెప్పారట. అందుకు అంగీకరించే ఆమె సైన్చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాలో పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆమె కనిపిస్తుందని అంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన పవన్ పోస్టర్ కు సోషల్ మీడియాలో అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
పవన్ కల్యాణ్ కి గుర్రాలపై స్వారీలు చేసే పాత్రలు అంటే ఇష్టం .. తుపాకులతో దడదడలాడించడ మంటే ఇష్టం. ఆయనను అలా చూడటం అభిమానులకు ఇష్టం. అందుకే ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఉన్నారు. ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో ఈ సినిమా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్ తాజా చిత్రమైన ‘వకీల్ సాబ్‘ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Must Read ;- ‘వకీల్ సాబ్’ కామిక్ బుక్.. సోషల్ మీడియాలో వైరల్