మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త వివాదానికి తెరతీసింది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇటీవలే ఎన్నికల్లో గెలుపొంది బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పదవిలో ఆయన దూకుడు మామూలుగా లేదు. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున శ్రీనిజ అనే సీనియర్ నటి కొంత గందరగోళం సృష్టించింది. ఆ తర్వాత ఆమె మీడియాకి ఎక్కి విమర్శలు గుప్పించింది. నటుడు మోహన్ బాబు, నరేష్ ల పైనా, ఎన్నికల తీరుపైనా ఆమె ఘాటుగా విమర్శలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలను అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది.
ఆమెను మా శాశ్వత సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అక్టోబరు 23న జరిగిన మా కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మా ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఆమె వ్యాఖ్యలు చేసినట్టు భావించి ఆమెకు ముందుగానే షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసు అందిన మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా కోరారు. దానికి ఆమె సమాధానం కూడా ఇచ్చారు. అది తమకు సంతృప్తి కలిగించనందున కార్యవర్గం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది.
కొత్త ప్యానల్ కొలువుదీరిన తర్వాత ఓ శాశ్వత సభ్యురాలిపై ఇలాంటి చర్య తీసుకోవడం మొదటి సారి. ఇలాంటి సస్పెన్షన్ వేటు వేయకుండా ఆమెను మందలించి పంపి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు. ఈ విషయంలో విష్ణు కొంత సంయమనం పాటించి ఉంటే బాగుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వివాదాస్పద నిర్ణయం మీద మళ్లీ రచ్చ జరిగే అవకాశం కూడా ఉంది.
ప్రకాష్ రాజ్ వర్గం దీన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి. విష్ణుకు వ్యతిరేకంగా ఆమె స్పందించింది అంటే ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచిందనే కదా అర్థం. మరి ఆమెను ప్రకాష్ రాజ్ వర్గం అండదండలు ఏమేరకు ఉంటాయో చూడాలి. ఏ పరిస్థితుల్లో తాను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో కూడా ఆమె మీడియా ముఖంగా వివరించింది. పైగా ఆమె అనారోగ్యంతో కూడా బాధ పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు.











