తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నిర్వహించిన రోడ్ షో అనంతరం అక్కడే జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జగన్ సాగిస్తున్న దురంహకార పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. సంక్షేమం పేరిట పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న జగన్… ఆ డబ్బును మద్యం విక్రయాల ద్వారా తిరిగి వెనక్కు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. అమ్మ ఒడి పేరిట తల్లి ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తున్న జగన్ సర్కారు… మద్యం బుడ్డీ అమ్మకంతో తండ్రుల నుంచి ఏకంగా రూ.30 వేల కోట్లను దోచుకుంటున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని ఎందుకు ఓడించాలి? టీడీపీని ఎందుకు గెలిపించాలన్న విషయాన్ని చెప్పేందుకే తాను వచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఈ వయసులోనూ తాను ఎన్నికల ప్రచారానికి వచ్చానని చెప్పుకొచ్చారు.
తిరుపతి ఉప ఎన్నికలు :
తిరుపతి ఉప ఎన్నికలో ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పడం ద్వారా జగన్ సాగిస్తున్న దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడాలని, ఈ దిశగా తిరుపతి ఉప ఎన్నికలో వేసే ఓటు జగన్ సర్కారు అరాచక పాలనను అంతం చేసే దిశగా తొలి అడుగుగా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రిగా తనకు దక్కిన రికార్డును ఏ ఒక్కరూ చెరిపివేయలేనిదేనని చెప్పిన చంద్రబాబు… ఉమ్మడి రాష్ట్రానికి పదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన ఘనత తనదని చెప్పారు. తాను చేసిన అభివృద్ది పనుల్లోనే ఇప్పుడు కోవిడ్ టీకా ఉత్పత్తి అవుతోందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టిన జగన్,… అధికారం చేతికందగానే పిడిగుద్దులు గుద్దుతున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. తాను అధికారంలో ఉండగా రూ.250కి దొరికే సిమెంటు బస్తా జగన్ పాలనలో రూ.400లకు చేరిపోయిందని, తన సొంత కంపెనీకి లాభాలు చేకూర్చేందుకే జగన్ సిమెంట్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశారని ఆరోపించారు. స్టీలు ధరలూ పెరిగిపోయాయని, ఇసుక అసలే దొరకడం లేని పరిస్థితులను కల్పించారని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్రంలో సాగుతున్న జగన్ అరాచక పాలన నుంచి ఉపశమనం లభించాలంటే… తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని ఓడించి తీరాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన వారిని కాపాడేందుకు యత్నిస్తున్న జగన్ కు సాధారణ ప్రజలు ఓ లెక్కా అని కూడా చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పాలన ఎలా ఉందన్న విషయం… వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు భద్రత లేదని ఏకంగా ప్రధానికి మొరపెట్టుకోవడంతోనే అర్థమవుతుందని కూడా చంద్రబాబు చెప్పారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే… ఎంతటి వారిపై అయినా కక్షసాధింపులకు దిగే జగన్… తన పాలనపై వ్యతిరేక కథనాలను రాస్తోందన్న ఒకే ఒక్క కారణంతో ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన విశాఖలోని ప్రింటింగ్ ప్రెస్ ను కూల్చడమే ఇందుకు నిదర్శనంగా చంద్రబాబు చెప్పారు. ఇలాంటి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే… తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు. ఈ ఎన్నికలో ఓటర్లు తమ ఓటు హక్కును వివేకంతో వినియోగించి జగన్ అరాచక పాలనకు బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Must Read ;- తిరుమల పవిత్రతను కాపాడాలి.. చంద్రబాబు