పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార వైసీపీపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ముప్పేట దాడిని మొదలెట్టేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన సాగిస్తుండగా… తాజాగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా బరిలోకి దిగేశారు. ఈ ఎన్నికలో వైసీపీకి ఓటు వేయొద్దని వారిద్దరూ ఓటర్లకు చెబుతూ వస్తున్నారు. వైసీపీకి ఓటు ఎందుకు వేయకూడదు? టీడీపీకే ఎందుకేయాలి? ఈ ఎన్నికలో వైసీపీ ఓడితే జనానికి కలిగే లాభాలేమిటి? టీడీపీ విజయంతో అంతిమంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జరిగే న్యాయమేమిటి? అన్న విషయాలపై ప్రధానంగా దృష్టి సారించిన చంద్రబాబు, లోకేశ్ లు వైసీపీపై ముప్పేట దాడి చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజవర్గ పరిధిలోని పొదలకూరులో చంద్రబాబు, అదే జిల్లా కోటలో లోకేశ్ రోడ్ షోలు నిర్వహించారు. ఇద్దరూ వైసీపీ అరాచకాలపై నిప్పులు చెరిగారు.
వైసీపీ ఓడితే జగన్ నేలకు దిగుతారు: చంద్రబాబు
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ ఓడితే… అధికారం చేతికందిందన్న భావనతో ఆకాశంలో విహరిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నేలకు దిగుతారని చంద్రబాబు అన్నారు. పొదలకూరు రోడ్ షోలో పాల్గొన్న సందర్భంగా జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేసినంత మాత్రాప పెద్దగా ఫలితమేమీ లేదని నర్మగర్బంగానే చెప్పిన చంద్రబాబు… వైసీపీ మాత్రం ఓటేస్తే జగన్ గర్వం మరింత పెరుగుతుందన్నారు. తిరుపతి సీటుతో టీడీపీ అధికారంలోకి రాలేదని తమకూ తెలుసని, అయితే వైసీపీ ఓడిపోతే మాత్రం ప్రజలను తీవ్ర కష్టాలకు గురి చేస్తున్న జగన్ గర్వం మాత్రం నేలకు దిగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ గర్వం నేలకు దిగితే ఒక్క తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలకే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలకు కూడా మేలు జరుగుతుందన్నారు.
అసలు ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో జగన్ చెప్పాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. అన్నింటా ధరలు పెంచినందుకా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని నమ్మించి మోసం చేసినందుకా? మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం ధరలను పెంచి ప్రభుత్వాన్నే మద్యం వ్యాపారంలోకి తీసుకొచ్చినందుకా? రైతు భరోసా పేరు చెప్పి మిగిలిన అన్ని పధకాలను నిలుపుదల చేసినందుకా? అని చంద్రబాబు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదని, జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ అహంకారం తగ్గాలంటే తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని ఓడించి తీరాలని చంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
టీడీపీ కార్యకర్తల జోలికొస్తే సహించం: లోకేశ్
అధికారం చేతిలో ఉంది కదా అని టీడీపీ కార్యకర్తలు, నేతలపై వేధింపులకు పాల్పడితే సహించేది లేదని నారా లోకేశ్ వైసీపీ సర్కారుకు వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కోట పరిధిలో రోడ్ షోలో పాల్గొన్న లోకేశ్… జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంటిలోనే దారుణంగా హత్య చేస్తే… సీఎం హోదాలో ఉండి కూడా ఇప్పటికీ దోషులెవరో కనిపెట్టలేని జగన్… ఇక రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో జగన్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేశ్… ఈ కేసులో తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ప్రమేయం లేదని తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సాక్షిగా జగన్ ప్రమాణం చేయగలరా? అని కూడా లోకేశ్ సవాల్ విసిరారు. దీనికి సంబంధించి జగన్ కు ఇప్పటికే తాను విసిరిన సవాల్ ను మరోమారు గుర్తు చేస్తున్నానని, తన సవాల్ కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక చెల్లిని ఢిల్లీలో, మరో చెల్లిని హైదరాబాద్ లో అనాథలుగా వదిలేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. వివేకా హంతకులెవరన్న విషయాన్ని నిగ్గుతేల్చి వివేకా కుటుంబానికి న్యాయం చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలపై నిత్యం బెదిరింపులకు దిగుతూ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్… ఇకపై ఇలాంటి దుర్మార్గాలను సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
Must Read ;- ‘హోదా’ చుట్టూనే తిరుపతి బరి.. గెలుపు ఎవరిదో..?