Special Status to AP plays key role in Tirupati bypoll
ఏపీలో తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తి రేకెత్తిస్తోంది. స్థానిక అంశాల కంటే కూడా ఏపీకి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా అంశం ఈ ఎన్నిక ఫలితాలపై భారీగానే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. స్థానిక అంశాల కంటే కూడా ప్రత్యేక హోదానే కీలకంగా పనిచేయనన్నట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగానే… ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించి గతంలో తిరుపతి వేదికగానే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ, దానిని అటకెక్కించిన కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు, ప్రస్తుతం ఆయా పార్టీలు హోదాను కేంద్రంగా చేసుకుని సాగిస్తున్న పోరాటం తిరుపతి ఉప ఎన్నికలో ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. వెరసి తిరుపతి ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రత్యేక హోదా అంశమే నిర్ధారించనుందని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదానే నిర్ణయాత్మక అంశమైన వేళ… ఈ ఎన్నికలో ఏ పార్టీకి విజయావకాశాలున్నాయి? ఏ పార్టీ భారీగా నష్టపోతుంది? అన్న అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మూడు పార్టీల మధ్య పోరు
తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఉన్నికలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోరుగానే చూడాలి. ఈ ఉప ఎన్నికలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. వామపక్షాలు సహా మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులు… మొత్తంగా 20 మందికి పైగా అభ్యర్థులు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన కూటమి తరఫున మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ బరిలోకి దిగారు. ఇక రాష్ట్రంలో పూర్తిగా చతికిలబడిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థిగా సీనియర్ రాజకీయవేత్త, తిరుపతి లోకల్ లీడర్ చింతా మోహన్‌ను రంగంలోకి దించింది. వీరితో పాటు చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నా… ప్రధానంగా వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన కూటమిల మధ్యే ప్రధానంగా పోటీ జరగనుంది. చింతా మోహన్ కొంత మేర ఓట్లు చీల్చే అవకాశాలు కనిపిస్తున్నా… ఫలితాన్ని పెద్దగా ప్రభావితం చేయలేరన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అభ్యర్థులను బరిలోకి దించడానికి ముందు..
ఆయా పార్టీలు తిరుపతి బరిలోకి తమ అభ్యర్థులను బరిలోకి దించడానికి ముందు ప్రత్యేక హోదా పెద్దగా ప్రస్తావనకు రాలేదనే చెప్పాలి. అయితే ఎప్పుడైతే… ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయో, వారు తమ నామినేషన్లను దాఖలు చేశారో, వారంతా ఎప్పుడైతే ప్రచారం మొదలెట్టేశారో… అప్పుడే ప్రత్యేక హోదా కూడా ఎంట్రీ ఇచ్చేసింది. అభ్యర్థులు సాగిస్తున్న ప్రచారం కంటే కూడా ప్రత్యేక హోదాపై ఏఏ పార్టీలు ఎలాంటి వ్యూహాలు అవలంభిస్తున్నాయన్నదే ఇప్పుడు ప్రధానాంశంగా మారిపోయింది. ఇక అభ్యర్థులు కూడా ఈ విషయాన్ని గుర్తించి… ప్రత్యేక హోదాపై నోరు విప్పడంతో పాటుగా దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ… ప్రత్యర్థి వర్గాలపై దానిని ఓ అస్త్రంగా మలిచి సంధిస్తున్నారు. దీంతో ఇప్పుడు తిరుపతి అభివృద్ధి అంశం పూర్తిగా పక్కకు పోగా… ప్రత్యేక హోదా అంశమే కీలకంగా మారిపోయిందని చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదా అంశం… తిరుపతి ఎన్నికలో ఏ పార్టీకి ఎలాంటి ఫలితం ఇస్తుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

వైసీపీకి గడ్డు పరిస్థితే..
ముందుగా అధికార పార్టీ వైసీపీకి తిరుపతి బరిలో గడ్డు పరిస్థితే ఎదురు కానుందని చెప్పక తప్పదు. ఎందుకంటే… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను ఇస్తే… కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుని వస్తానని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాస్తంత గట్టిగానే ప్రకటనలు చేశారు. ఆయన భావించినట్టుగానే… ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 22 సీట్లు దక్కాయి. వైసీపీకి మెజార్టీ సీట్లు వచ్చాయి కదా… ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేసినట్టేనన్న వాదనలూ వినిపించాయి. అయితే సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్… ప్రత్యేక హోదాను తాను తీసుకురాలేనన్న మాటను పరోక్షంగా బయట పెట్టేశారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు బలంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అడగడం మినహా కేంద్రం మెడలు వంచి హోదాను సాధించడం కలేనన్న మాటను ఆయన వెల్లడించారు. మొత్తంగా ప్రత్యేక హోదాపై ఆ పార్టీ తన స్టాండ్ ను మార్చేసిందనే చెప్పాలి. దీంతో తిరుపతి బరిలో ప్రత్యేక హోదా సాధనలో చేతులెత్తేసిన వైసీపీకి గడ్డు పరిస్థితులే ఎదురు కానున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Special Status to AP plays key role in Tirupati bypoll :
టీడీపీపై సానుభూతి..
ఇక విపక్షం టీడీపీ విషయానికి వస్తే… 2014లో బీజేపీతో జత కట్టిందే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిందచేందుకేనని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అప్పుడే చెప్పేశారు. అంతేకాకుండా తిరుపతికి వచ్చిన ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ చేత అదే ప్రకటనను చేయించగలిగారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం… ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు అలుపెరగని పోరాటం సాగించడం… ప్రధాని అయ్యాక మోదీ మాట మార్చేయడం, ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పడం, చేసేది లేక… అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టున పడేయడమే లక్ష్యంగా సాగిన చంద్రబాబు అందుకు ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి.
అయితే ప్యాకేజీ విషయంలో కూడా మోదీ సర్కారు తనదైన ఎత్తులతో కాలయాపన చేయడంతో కేవలం ప్రత్యేక హోదాను ఇవ్వలేదన్న కారణంతోనే బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న వైనం కూడా తెలిసింది. ఆ తర్వాత రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీని టార్గెట్ చేసుకుని చంద్రబాబు సాగించిన పోరాటం ఏపీ ప్రజలను ఆకట్టుకుందనే చెప్పాలి. అయితే ఈ పోరాటం ఎన్నికల్లో ఓట్ల రూపం దాల్చకపోవడంతో టీడీపీ ఓడిపోగా… ప్రస్తుతం పార్లమెంటుకు తనకున్న అరకొర సభ్యులతోనే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచగలుగుతున్న టీడీపీపై జనంలో సానుభూతి అయితే స్పష్టంగానే కనిపిస్తోంది. హోదా కేంద్రంగానే తిరుపతి ఓట్లు పోలైతే… ఎలాంటి అక్రమాలు జరగకపోతే… తిరుపతి గెలుపు గుర్రం టీడీపీ అభ్యర్థిదేనని చెప్పక తప్పదు.
మాట మార్చేసిన బీజేపీ..
ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి… అధికారం చేతికందగానే మాట మార్చేసిన బీజేపీపై ఏపీ ప్రజల్లో బాగానే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎక్కడైతే ప్రత్యేక హోదాపై మోదీ హామీ ఇచ్చారో… అక్కడే ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థికి గట్టి గుణపాఠమే చెప్పేందుకు తిరుపతి ప్రజలు సిద్ధంగానే ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న జనసేన కూడా తొలుత ప్రత్యేక హోదా కోసం తనదైన శైలిలో పోరాటం సాగించి ఆ తర్వాత మిన్నకుండిపోయిన వైనంతో పాటు… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజపీతో జతకలిసిన జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతిచ్చే అభ్యర్థికి తామెందుకు ఓటేయోలన్న ప్రశ్నలు కూడా తిరుపతి ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా తిరుపతి పరిధిలో భారీగా ఉన్న పవన్ సామాజిక వర్గం ఓట్లు కూడా ఇప్పుడు బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థి రత్నప్రభకు పడే అవకాశాలు లేవన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రత్యేక హోదా కేంద్రంగానే తిరుపతి ఎన్నిక జరిగితే… హోదాపై మాట మార్చేసిన బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థితో పాటుగా వైసీపీ అభ్యర్థికి కూడా గెలుపు దక్కదనే చెప్పాలి. ఇప్పటికీ ప్రత్యేక హోదాపై తమదైన పోరాటం చేస్తున్న టీడీపీకి జనం మొగ్గు చూపితే… పనబాక లక్ష్మి గెలుపు నల్లేరుపై నడకేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read:తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ











