అక్కినేని సుమంత్ ప్రస్తుతం తన కెరీర్ లో ఎదురీతున్నారు. ఆయన సరైన హిట్ కొట్టి చాలా ఏళ్ళు అయిపోతోంది. ఆ మధ్య విడుదలైన ‘మళ్ళీ రావా’ సినిమా పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చిన ‘సుబ్రహ్మణ్య పురం, ఇదం జగత్ , యన్టీఆర్ సిరీస్, రీసెంట్ గా విడుదలైన ‘కపటధారి’ మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. కన్నడ రీమేక్ అయినప్పటికీ తెలుగులో ‘కపటధారి’ మూవీకి కనీస వసూళ్ళు కూడా దక్కలేదు. దాంతో ఇప్పుడు సుమంత్ ఒకే ఒక సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఆ సినిమా పేరు ‘అనగనగా ఒక రౌడీ’.
ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. గార్లపాటి రమేశ్, టీయస్ వినీత్ భట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు మను యజ్ఞ. ఇందులో సుమంత్ వాల్తేర్ శీను అనే రౌడీ పాత్రను పోషిస్తున్నారు. ఆయనతో పాటు.. రఘు కారుమంచి, జబర్దస్త్ రామ్ ప్రసాద్, మధునందన్, ధన్ రాజ్, మిర్చి కిరణ్, మనోజ్ నందం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా మలయాళంలో మూడేళ్ల క్రితం విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘పడయోట్టం’ కి రీమేక్ వెర్షన్ అంటున్నారు. బిజుమీనన్ హీరోగా నటించిన ఈ సినిమాకి రఫిక్ ఇబ్రహిమ్ దర్శకుడు. ఇందులో నిజా నిజాలేంటో తెలియదు కానీ.. ‘అనగనగా ఒక రౌడీ’ మూవీ మీద టాలీవుడ్ లో మంచి బజ్ ఉంది.
‘పడయోట్టం’ సినిమా విషయానికొస్తే.. అందులో హీరో కరుడుగట్టిన రౌడీ యే అయినా.. అతడికి తల్లంటే ప్రాణం. తల్లి పేరెత్తితే ఎవరికైనా ఏమైనా చేసే మనస్తత్వం అతడిది. అలాంటి రౌడీకి ఓ నలుగురు కుర్రోళ్ళు .. ఒకడి కాళ్ళు, చేతులు విరగ్గొట్టమని సుపారీ ఇస్తారు. ఆ క్రమంలో రౌడీతో ఆ కుర్రోళ్ళు సాగించిన కామెడీ జెర్నీ యే ఈ సినిమా. కామెడీ విత్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘అనగనగా ఒక రౌడీ’ సుమంత్ కు ఏ మేరకు ప్లస్ అవుతుందో ? ఆయన ఈ సినిమా తో ఏ స్థాయి హిట్ అందుకుంటారో చూడాలి.
Also Read : సుమంత్ ‘కపటధారి’గా వచ్చేది అప్పుడే.. !











