శర్వానంద్ హీరోగా రామ్ ఆచంట – గోపీ ఆచంట ‘శ్రీకారం’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ‘మహాశివరాత్రి’ కానుకగా వచ్చేనెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను మహేశ్ బాబు చేతులమీదుగా రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయించనున్నారు.
ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ, ఈ సినిమా టీమ్ టీజర్ రిలీజ్ డేట్ .. టైమ్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహేశ్ బాబు టీజర్ ను రిలీజ్ చేయడం .. ఈ సినిమా ప్రమోషన్స్ కి మరింత ఊపునిచ్చే అంశం. ‘జాను’ సినిమాతో పరాజయాన్ని అందుకున్న శర్వానంద్ ఈ సినిమాపైనే గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా కథ గ్రామీణ ప్రాంతంలో .. వ్యవసాయం నేపథ్యంలో కొనసాగుతుంది. శర్వానంద్ రైతు పాత్రలో కనిపించనుండటం ఆసక్తిని రేకె త్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లిరికల్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా ద్వారా పరిచయమైన ఈ బ్యూటీకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా కూడా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. మిక్కీ జె.మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. రేపు విడుదల కానున్న టీజర్ తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతాయేమో చూడాలి.











