విశాఖ నగరంలోని ఎమ్మెల్యేలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు విస్తృతంగా జరుగుతున్న ప్రచారంతో దిక్కుతోచని స్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పార్టీ ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అడపాదడపా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా అవన్నీ వర్చువల్ రూపంలోనే ఉంటున్నాయి. వెలగపూడి రామకృష్ణబాబు భారీగానే కార్యక్రమాలు చేపట్టినా… ఆయనపై పలు కేసులు నమోదుచేశారు. ఎమ్మెల్యేలంతా వైఎస్సార్సీపీలో చేరి పోతున్నారనే ప్రచారంతో క్యాడర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఉన్నవి రెండే ఆప్షన్లు..
పార్టీపై ప్రేమను పక్కనపెట్టి.. తాము నమ్ముకున్న నాయకుడి వెంటే నడిచి అధికార పార్టీలో చెలామణీ కావడం.. లేదా కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండడం. నాయకుడిని వదిలి తెలుగు దేశం పార్టీలో కొనసాగినా.. బలంగా పార్టీని ముందుకు నడిపించే మరో నాయకుడు వాళ్ళకి కానరావడం లేదు. మరొకరు వచ్చినా వారి దగ్గర గుర్తింపు తెచ్చుకునేందుకు మరికొంత సమయం పట్టడం ఖాయం.
ఈ దశలో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండడమే ఉత్తమంగా కొందరు నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపళంగా అధికార పార్టీ లోకి వెళ్ళిన… అప్పటికే స్థిరపడిన నాయకులను దాటుకుని ముందుకు వెళ్ళడం అంత సులభం కాదన్నది వారి అభిప్రాయం.
ఓ యువ నాయకుడు అవసరం..
ప్రస్తుత తరుణంలో టిడిపి కార్యకర్తలు, నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే యువ నాయకుడు ఎంతైనా అవసరం. దక్షిణ నియోజకవర్గం కార్యకర్తల్లో భరోసా కల్పించేందుకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై కేసులు నమోదు చేస్తున్నారు. వాటిని దీటుగా ఎదుర్కొంటూ.. కార్యకర్తల్లో పోరాటపటిమను నూరిపోసే నాయకుడు ఎవరైనా ఉన్నారా?











