గతంలో ఆగిపోయిన సినిమాల్ని అభిమానులకోసం.. ఇప్పుడు విడుదల చేసే సరికొత్త ట్రెండ్ కు నాంది పలికారు బాలయ్య. ఒకప్పుడు తాను ప్రతిష్ఠాత్మకంగా భావించి స్వీయ దర్శకత్వంలో భారీగా మొదలుపెట్టిన ‘నర్తనశాల’ సినిమా సౌందర్య మరణంతో అర్ధంతరంగా ఆగిపోయింది. ఇప్పటికి పదహారేళ్ళయినప్పటికీ.. 17 నిమిషాలు మాత్రమే కలిగిన ఆ సినిమా విజువల్స్ ను ఈ నెల 24న శ్రేయాస్ ఈటీ లో పేఫర్ వ్యూ ద్వారా విడుదల చేస్తున్నారు. నచ్చిన వాళ్లు మాత్రమే చూస్తారు అని భావించిన మేకర్స్ వచ్చే కలెక్షన్స్ ను బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ కు అందించనున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో కొంత భాగం షూట్ చేసి ఆపేసిన.. మెగాస్టార్ చిరంజీవి ‘అబు బాగ్దాద్ గజదొంగ’ సినిమాని కూడా అదే విధానంలో విడుదల చేస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో బడ్జెట్ పెరిగిపోవడం.. పాతపడినట్టు గా చూపించడానికి ఖురాన్ ను టీలో ముంచి .. ఎండబెట్టారన్న కారణంగా అప్పట్లో ఈ సినిమాకి ముస్లీమ్స్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సురేశ్ కృష్ణ దర్శకత్వం, ఎ.ఆర్.రహమాన్ సంగీతం లో ప్రతిష్ఠాత్మకంగా మొదలై ఆగిపోయిన ఈ సినిమా ‘నర్తనశాల’ లాగానే విడుదలైతే.. చూడాలని అభిమానులు కోరుకుంటూండడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి చిరంజీవి ఈ సినిమాను విడుదల చేసే విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.