తమిళ స్టార్ హీరో సూర్య , మాస్ దర్శకుడు హరి కలయికలో వచ్చిన ‘సింగం’ సిరీస్ .. ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సిరీస్ లో మొత్తం మూడు సినిమాలు విడుదలవగా.. మూడూ మాస్ జనానికి బాగా ఎక్కేశాయి. సింహం లాంటి ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ .. అవినీతి, అరాచకాలకు పాల్పడే మానవ మృగాల్ని ఏవిధంగా వేటాడు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూడు సినిమాల్లోనూ సూర్య నటన , డైలాగ్స్ థియేటర్స్ లో క్లాప్స్ కొట్టించి, విజిల్స్ వేయించాయి. ఈ మూడు సినిమాలు తెలుగులో కూడా విడుదలై.. ఇక్కడా దుమ్ము రేపేశాయి.
అందుకే ఇప్పుడు ‘సింగం’ సిరీస్ లో నాలుగో చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు మేకర్స్. సిరీస్ లోని అన్ని సినిమాల్లో లాగానే .. సూర్య .. హోం మినిస్టర్ అప్పగించిన ఓ కీలకమైన కేసును ఇన్వెస్టిగేట్ చేయడం.. ఆ క్రమంలో అడ్డుపడే వారిని కలుపు మొక్కల్లా ఏరేయడం అనే టాస్క్ నాలుగో సినిమాలో కూడా ఉండబోతోంది. అయితే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ను మరింత భారీగా.. ఎట్రాక్టివ్ గా డిజైన్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఒక్క వివేక్ పాత్ర తప్ప.. గత మూడు సినిమాల్లోనూ మెప్పించిన ముఖ్యమైన పాత్రలు ఈ సినిమాలో కూడా ఉండబోతున్నాయని టాక్.
నిజానికి ‘సింగం’ నాలుగో భాగం ఈ పాటికి ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళాలి. కరోనా కారణంగా ఈ సినిమా ఇంతవరకూ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు దీనికి సమయం ఆసన్నమైంది. అన్నీ కుదిరితే.. ఈ ఆగస్ట్ లోనే ‘సింగం 4’ సెట్స్ మీదకు వెళ్ళబోతోందని సమాచారం. ఇక ఈ సినిమాలో కూడా అనుష్కనే కథానాయికగా నటిస్తుందని అంటున్నారు. మరి తెలుగులో కూడా విడుదల కానున్న ‘సింగం 4’ సినిమా ఎంతటి ఆసక్తికరమైన కథతో రూపొందుతుందో చూడాలి.
Must Read ;- సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ మూవీకి మరో అరుదైన గౌరవం