తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి వెళ్ళేందుకు మరో నినాదం ఎంచుకుంది. ఇప్పటికే పార్టీపై ప్రజల్లో సానుకూల వాతావరణ ఉందని చెప్పుకుంటున్న నేతలు దానికి సెంటి మెంట్ జోడించే పనిలో పడ్డారు. సెంటిమెంట్ పాతదే అయినా రాష్ట్రంలో కొత్తతరహాల్లో దాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. పార్టీని ఎదురులేని శక్తిగా ఎదిగేలా చేసిన రాముడినే నమ్ముకుంది బీజేపీ. అయోధ్యలో రామ మందిర నిర్మాణం .. తెలంగాణాలో రామరాజ్య స్థాపన పేరుతో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది. రాబోయే ఇరవై రోజుల పాటు అయోధ్య రామమందిర నిర్మాణ నిది సమర్పణ కార్యక్రమంతో ఇంటింటికి వెళ్ళబోతోంది బీజేపీ. ఇదే అవకాశంగా పార్టీని బలోపేతం చేసేపనిలో పడిందన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది.
కేసీఆర్ పాలనా వైఫల్యాలే టార్గెట్..
తన కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది. రాజకీయంగా కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎండగట్టడంతో పాటు ప్రజల్లో ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని.. కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. అన్ని వర్గాలు పోరాటానికి సిద్దమవుతున్నాయని.. వారికి మద్దతిస్తూ పోరాటంలో ముందుండాలన్న వ్యూహరచన చేస్తోంది. ఉద్యోగ , ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మొహం చాటేస్తోందని.. వారిని తీవ్ర ఇబ్బందులు పాటు చేస్తుందంటూ ఇప్పటికే పలు ఆందోళణనలు చేపట్టింది రాష్ట్ర బీజేపీ. ఈ పోరాటాలను మరింత ఉధృతం చేయడం ద్వారా ప్రజలను తమ వైపు తిప్పుకునే పనిలో పడింది.
అన్ని వర్గాలను ఏకం చేసే దిశగా అడుగులు..
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటాలను ఉధృతం చేయాలని నిర్ణయించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రగతి భవన్, ఫాం హౌజ్ పాలన సాగుతోందని.. ఇది రాక్షస పాలనగా మారిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ .. ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బండి సంజయ్ చేస్తున్న కృషికి ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుందన్న భావనలో ఉంది రాష్ట్ర నాయకత్వం. కేసీఆర్ పాలనను మరికొంత కాలం కొనసాగిస్తే ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడటం ఖాయం అన్న భావనను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం, దేశంలో మోడీ పాలనలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం ద్వారా రామరాజ్య స్థాపన కోసం బీజేపీని బలపరచమని ప్రజలకు వివరించాలని భావిస్తోంది. మరి బీజేపీ పాత నినాదం కొత్తగా వర్కౌట్ చేయాలనుకుంటున్న నేతల ప్రయత్నాలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు.. బీజేపీ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారా చూడాలి.