గత సీజన్‌ను కరోనా ముంచేసింది. ఈ సీజన్‌నూ వెంటాడుతోంది. పది నెలల తర్వాత పోటీల బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ సింధు మ్యాచ్ ప్రాక్టీస్ లేక తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సాయిప్రణీత్ కూడా ఆమెలాగే ఓడిపోయాడు. ఇక.. సైనా థాయ్లాండ్ క్రీడాకారిణి బుసానన్ చేతిలో ఓటమి పాలైంది. శ్రీకాంత్ గాయంతో ప్రిక్వార్టర్స్ పోరు నుంచి నిష్క్రమించాడు. సాత్విక్, అశ్విని సైతం ఇంటిబాట పట్టారు. ఫలితంగా థాయ్‌లాండ్ ఓపెన్ లో భారత్ కథ ముగిసింది.
ఆదినుంచీ ఆటు పోట్లే…
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం నుంచే భారత్ ఆటుపోట్లు ఎదురయ్యాయి. ప్రాక్టీస్ లేక కొందరు ఇంటిబాట పడితే.. ప్రత్యర్థిని ఓడించలేక మరికొందరు ఓటమి చవిచూశారు. ఈ మొత్తంలో కరోనా సైతం తనదైన పాత్ర పోషించింది. ఆది నుంచి ఇంటికి చేరేవరకూ వెంటాడుతూనే ఉంది. ఆదిలోనే రిపోర్టుల రూపంలో భారత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఒకానొక దశలో భయం కలిగించింది. మనోళ్లకు కరోనా లేదని తెలిసేసరికే.. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
కరోనా ఆడేసుకుంది…
థాయ్లాండ్ ఓపెన్ ప్రారంభంలో క్రీడాకారులకు అందరికీ ముందస్తుగా పరీక్షలు చేశారు. అందులో మనోళ్లందరితో కరోనా ఓ ఆట ఆడేసుకుంది. కోర్టులోకి దిగకముందే.. అసలైన ఆటేంటో చూపించింది. అగ్రశ్రేణి షట్లర్ సైనా, ప్రణయ్‌లను టెస్టులు కలవరపెట్టాయి. తీరా యాంటీబాడీ టెస్టులతో అవి గత అవశేషాలనీ తేలడంతో ఊపిరి పీల్చుకున్నారంతా! మరో భారత టాప్‌స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు చేసిన కరోనా టెస్టులైతే రక్తం చిందించేలా చేశాయి. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్ సీజన్ పరేషాన్‌తో ప్రారంభమైంది.
ప్రిక్వార్టర్స్ పోరు నుంచే ఇంటికి…
యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో మన పాత్ర ముగిసింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 23-21, 14-21, 16-21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూసింది. గాయం కారణంగా శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్ పోరు నుంచి వైదొలిగాడు. ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ 19-21, 17-21తో ఎహసాన్-సెతియవన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్- అశ్విని 12-21, 17-21తో చాంగ్-యుంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడారు.